Minister Appalraju: ఏపీ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజుకు సొంత నియోజకవర్గమైన పలాసలో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. విపక్షం కన్నా స్వపక్షంలోనే ఇది ఎక్కువగా ఉంది. ఇప్పటికే వ్యతిరేక వర్గం పలాస, వజ్రపు కొత్తూరు, మందస మండలాల్లో బహిరంగ సమావేశాలు నిర్వ హించి మంత్రికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యతిరేక కూటమిని కలుపుకోవడంలో సీదిరి పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మంత్రి అప్పల రాజుకు ముఖ్యమంత్రి వద్ద మంచి మార్కులున్నా సొంత కేడర్లో మాత్రం గ్రాఫ్ తగ్గుతోంది. తొలిసారిగా పలాస సెగ్మెంటు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు అప్పలరాజు. వైసీపీ అభ్యర్థిగా అప్పలరాజు బరిలో దిగి విజయం సాధించడమే గాకుండా మంత్రి కూడా అయ్యారు. ఎన్నికల సమయంలో అండగా ఉన్న సీనియర్ నాయకులు కొందరు ఇప్పుడు అప్పలరాజుతోపాటు అనుచరుల అరాచకాలు భరించలేకపోతున్నామంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 


వచ్చే ఎన్నికలలో ఆయనకే టిక్కెట్ ఇస్తే పార్టీకి నష్టమంటూ బాహాటంగానే కొందరు నేతలు వ్యతిరేకించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష నేతలను గట్టిగా ఎదుర్కొని దీటుగా విమర్శలు చేస్తున్న మంత్రి అప్పలరాజు సొంత నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోవడంలో విఫలమవుతుండటంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఆయన తీరుపై సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తుండం మంత్రి అప్పలరాజు వర్గీయులకు జీర్ణించుకోలేక పోతున్నారు. సీనియర్లను సీదిరి అప్పలరాజు విస్మరిస్తున్నారనే వాదన గట్టిగా అధిష్టానం వద్ద వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. గత కొద్ది నెలల నుంచి బహిరంగ సమావేశాలు నిర్వహించి మంత్రి అప్పలరాజుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు కొందరు మందస మండలంలో ఆదివారం పిక్నిక్ పేరిట సమావేశమై అప్పలరాజుపై మరో సారి వ్యతిరేకతను ప్రదర్శించారు. 




రానున్న ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే ఝలక్ ఇవ్వడం ఖాయమని బహిరంగంగా చెబుతున్నారు. పలాస సెగ్మెంటులోనే కాకుండా వైసీపీ జిల్లా నాయకుల్లో కలకలం నెలకొంది. అప్పలరాజు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, అతని అనుచరుల ఆరాచకం పెచ్చుమీరిపోతోందని ఘాటైన విమర్శలు గుప్పించారు. వైసీపీ జిల్లా కార్యదర్శి దువ్వాడ హేంబాబు చౌదరి, దువ్వాడ శ్రీకాంత్ నేతృత్వంలో సమావేశం జరిగింది. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు కొందరు సమావేశానికి హాజరై మంత్రి అప్పలరాజు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందరం తిప్పికొట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.


మంత్రి తీరుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు...


మంత్రి సీదిరి తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఫిర్యాదు చేయాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు. గతంలో పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో సమావేశమైన విషయం విధితమే. తాజాగా మందస మండలం దున్నవూరు సమీపంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం, దీనికి కొందరు వైసీపీ నేతలు హాజరవ్వడంతో మంత్రి అప్పలరాజుకు సెగ పెరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఎంతోమంది సీనియర్లను, పార్టీ జెండాను భుజాన వేసుకుని ఆది నుంచి పనిచేసిన వారిని కూడా పక్కన పెట్టిన సీఎం జగన్ మంత్రి పదవిని సీదిరికి కట్టబెట్టారు. అయితే సీదిరి ఈ గౌరవాన్ని పదవిని కూడా కాపాడుకునేలా వ్యవహరించడం లేదని, కొందరు నేతలను, గతంలో టీడీపీలో పని చేసే వారికే ప్రాధాన్యతను ఇస్తున్నారనే వాదనతో కొందరు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పకనే చెబుతున్నారు. అప్పలరాజు పై ద్వితీయ శ్రేణి నేతలు ఎంతగానో రగిలిపోతున్నారనడానికి వారు పెట్టే సమావేశాలు, బహిరంగంగా చేసే వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పక తప్పదు. సీనియర్లను కాదని అయిన వారికి కంచాల్లో.. కాని వారికి పొగపెట్టి పొమ్మన్న రీతిలో మంత్రి వ్యవహరిస్తున్నారని రెబల్ వర్గం అభిప్రాయ పడుతుంది. 


ఏకపక్ష నియంతృత్వ ధోరణితో క్యాడర్ విసిగిపోతున్నారని అందుకే వైసీపీ బాస్ దృష్టిలో పెట్టుకుని తాడోపేడో తేల్చుకోవాలనే మందసలో నిర్వహించిన సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు బోగట్టా. టెక్కలి నియోజకవర్గంలో వర్గపోరులో నేరుగా సీఎం జోక్యం చేసుకున్నట్టే, పలాస నియోజకవర్గంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కేడర్ భావిస్తోంది. కాగా మందస మండలంలో నిర్వహించిన సమావేశంలో అభ్యంతరాలన్నీ కూడా కాగితం రూపంలో ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు.


"సీనియర్లకు విలువ ఇవ్వడం లేదు. పలాస నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నాం. కష్టపడి పనిచేస్తున్న కేడర్ ను మంత్రి సీదిరి పక్కన పెడుతున్నారు. నియోజకవర్గంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి. రానున్న ఎన్నికల్లో పలాసలో వైసీపీ గెలుపొందాలంటే అభ్యర్థిని మార్చాలి. మంత్రి అనుచరుల్లో కొందరి వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోంది." - జుత్తు నీలకంఠం, మత్య్సకార నేత


పలాస సెగ్మెంటులో అభ్యర్థిని మార్చాలి..


"సీనియర్ నాయకులపై అప్పలరాజు చేస్తున్న అరాచకాలను  ఆరాచకాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతాం. పలాస సిగ్మెంటులో అభ్యర్థిని మార్చాలని కోరుతాం. అవినీతి, దౌర్జన్యాలకు కారణం ఎవరని తెలుసుకుంటే పార్టీ మనుగడ ఉంటుంది. మాపై జరుగుతున్న అణచివేతపై తెలియజేస్తాం. అభ్యర్థిని మార్చకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుంది." - దువ్వాడ హేంబాబు, వైసీపీ జిల్లా కార్యదర్శి


"వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఎంతో మంది కష్టపడి పని చేశారు. మంత్రి అప్పలరాజు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు పెచ్చు మీరుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, జిల్లా ఇంఛార్జీ, మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్తాం. సీఎంను కలుస్తాం. అప్పలరాజు వైఖరితో పార్టీకి దెబ్బ తగులుతుందనే ఆవేదనతోనే సమావేశం ఏర్పాటు చేశాం." - దువ్వాడ శ్రీకాంత్, వైసీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు