Durga Malleswara Swamy Varla Devasthanam: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో భక్తులు సమర్పించిన కానుకలను డిసెంబర్ 18 బుధవారం లెక్కించారు. 21 రోజులకోసారి మహామండపం అంతస్తులో ఈ లెక్కింపు సాగుతుంది. డిప్యూటీ ఈవో రత్నరాజు, దేవాదాయ శాఖాధికారులు, AEOలు, సిబ్బంది, ప్రత్యేక పోలీసులు, వన్‌టౌన్ సిబ్బంది, అమ్మవారి సేవాదారులు ఈ లెక్కింపులో పాల్గొన్నారు.
Also Read: భవానీలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్ లో ఉన్న సేవలేంటి ..ఈజీగా ఎలా నమోదు చేసుకోవాలి!
గత మూడు వారాల్లో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కలు ఇవే..
- నగదు రూపంలో రూ.3,68,90,834
- బంగారం 560 గ్రాములు
- వెండి 9 కిలోల 30 గ్రాములు
- USA డాలర్లు 519
- ఆస్ట్రేలియా డాలర్లు 80
- ఓ కువైట్ దినార్, 204 ఖతార్ రియాల్స్, 165 ఎమిరేట్స్ దిర్హమ్స్
- 516 మలేషియా రింగేట్లు, 130 సౌదీ అరేబియా రియాల్స్
- 60 కెనడా డాలర్లు, 1700 ఒమాన్ బైంసాలు , 916 సింగపూర్ డాలర్లు
- 55 మాల్దీవుల రూపియాలు లెక్కింపులో లభించాయి
- ఆన్ లైన్ ద్వారా అమ్మవారికి లక్షా 16 వేల 429 చేకూరింది
Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!
భవానీ దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు
అమ్మవారి ఆలయంలో ఈ నెల 21 శనివారం నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భారీగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా..ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగివెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు విజయవాడ పోలీస్ కుమిషనర్ రాజశేఖర్ బాబు, దేవస్ధానం ఈవో కేఎస్ రామారావు.
డిసెంబర్ 21నుంచి 25వరకు దీక్షాధారులు ఇరుముడులు సమర్పించనున్నారు.. ఈ ఏడాది దాదాపు 6లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. క్యూలైన్లలో వాటర్ ప్రూఫ్ షామియానాలు, నేలపై కాయర్ మ్యాట్‌లు, తాగునీటి పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేశారు. మైక్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు అవసరం అయిన సూచనలు అందించనున్నారు. తాత్కాలిక మరుగుదొడ్ల వద్ద నిరంతర పారిశుద్ధ్యపనులను మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తారు. గిరి ప్రదక్షిణ, ఇతర ముఖ్యమైన రహదారుల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. భవానీ భక్తులకు విశ్రాంతి ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు. స్నానఘాట్ల వద్ద భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటూ..స్నానఘాట్లలో వదిలేసే దీక్షా విరమణ వస్త్రాలు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు.
'భవానీ దీక్ష 2024' ప్రత్యేక యాప్
ఇప్పటికే దీక్షా విరణమకు వచ్చే భక్తుల సౌకర్యార్థం యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రసాదానికి కొరత లేకుండా సిద్ధం చేస్తున్నారు. భవానీ దీక్ష 2024' యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో మొత్తం వివరాలు స్పష్టంగా పొందుపరిచారు. దర్శనాల బుకింగ్ నుంచి ప్రసాదం, వసతి, పూజా విధానం , పార్కింగ్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, అత్యవసర ఫోన్ నంబర్ల వరకూ మొత్తం 24 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!