Akshaya Tritiya 2025 : అక్షయ తృతీత 2025 లో ఏప్రిల్ 30న వచ్చింది...

అక్షయ తృతీత రోజు బంగారం కొనాల్సిందేనా?

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో ఐశ్వర్యం పెరిగిపోతుందా?

అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోతే ఏమవుతుంది?

పురాణాల్లో ఏముంది ... ?

బంగారం కొనాలన్న ప్రచారంలో నిజమెంత? హిందువులకు ప్రతి పండుగా ప్రత్యేకమే. అయితే కొన్ని పండుగలు భక్తితో ముడిపడి ఉంటే మరికొన్ని పండుగలు సెంటిమెంట్స్ చుట్టూ తిరుగుతాయ్. ఇంకొన్ని పండుగలు భారీ ఖర్చుతో ముడిపడి ఉంటాయ్. అలాంటి పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ.

ఏటా వైశాఖమాసం ప్రారంభమైన మూడోరోజు వచ్చే తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజు బంగారం షాపులన్నీ వెలిగిపోతుంటాయ్. పోటీపడి ప్రకటించే ఆఫర్లు ఓ వైపు... కొంచెమైనా బంగారం కొనాలనే జనం మరోవైపు...దుకాణాలన్నీ జాతరను తలపిస్తాయి.  

అక్షయ తృతీయ అసలు ఉద్దేశం ఏంటో తెలుసా?

అక్షయం అంటే నాశనం లేనిది ఎప్పటికీ తరగనిది అని అర్థం. అక్షయం అంటే తరగని బంగారం అనే పూనకంతో పోటీపడి కొనేస్తున్నారు. ఈ రోజు బంగారం కొనేస్తే అక్షయం అయిపోతుందనుకుంటున్నారు. కానీ ఈరోజు బంగారం కొంటే పెరగదు.. బంగారం దానం చేస్తే అక్షయం అవుతుంది. పుణ్య కార్యాలు చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. 

కలిపురుషుడు నివాసం ఉండే 5 స్థానాల్లో బంగారం ఒకటి పుత్తడిని అహంకారానికి హేతువుగా చెబుతారు.. అందుకే అక్షయ తృతీయ రోజు కలిపురుషుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు, అహంకారం మరింత పెచ్చుకున్నట్టు అవుతుంది.  అందుకే ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం కాదు దానం చేయడం ముఖ్యం

బంగారం దానం చేసే స్తోమత అందరకీ ఉండదు కదా..అందుకే ఈ రోజు ఆహారం, వస్త్రాలు దానం చేస్తే దానివల్ల వచ్చే పుణ్యం అక్షయం అవుతుందని పండితులు చెబుతారు. వైశాఖమాసం ప్రారంభం కాబట్టి ఎండలు మండిపోయే సమయం. ఈరోజు కుండలో నీళ్లు పోసి దానం ఇవ్వాలి. పానకం, మజ్జిక, పండ్లు దానం చేయడం మరీ మంచిది.  బంగారమే కొనద్దంటే...శుభ ముహూర్తం ఏంటి?

బంగారం కొనేందుకు శుభముహూర్తం అంటూ మరో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అక్షయ తృతీయ మొత్తం మంచిరోజే. ఈ రోజు దుర్ముహుర్తం, వర్జ్యం, రాహుకాలం లాంటివి పనిచేయవు. రోజంతా అమృత ఘడియలతో సమానమే. అందుకే ఈ రోజు ఏం ప్రారంభించినా మంచే జరుగుతంది.  

మరి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలనే మాట ఎక్కడి నుంచి వచ్చింది?

ఇది కేవలం వ్యాపారం పెంచుకునే ట్రిక్ మాత్రమే. ఆ మాటలో పడి బంగారం కొనేయాల్సిందే అంటూ అప్పులు చేసి మరీ ఎగబడుతున్నారు.

బంగారం అనేది ఓ మంచి పెట్టుబడి, భవిష్యత్ కి భరోసా...చేతిలో డబ్బులున్నప్పుడు ఎప్పుడు కొనుగోలు చేసినా మంచిదే . అంతేకానీ అక్షయ తృతీయ రోజు కొంటే రెట్టింపు అవుతుందనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు.  

గమనిక:పండితులు చెప్పిన విషయాల ఆధారంగా రాసిన కథనం ఇది. అనవసర ప్రచారాల్లో చిక్కుకుని సెంటిమెంట్ పేరుతో ఓ పిచ్చిలో కొట్టుకుపోయే వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా సేకరించి అందించిన వివరాలు ఇవి. ఏపీపీ దేశం దీన్ని ధృవీకరించడం లేదు. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం