vidur niti in telugu: విదుర నీతి ధృతరాష్ట్ర మ‌హారాజు, ఆయ‌న మంత్రి విదురుడి మ‌ధ్య మహాభారత యుద్ధానికి ముందు జరిగిన సంభాష‌ణ‌. యుద్ధ ఫలితం గురించి సందేహించిన ధృత‌రాష్ట్రుడు.. విదురుడిని అడిగిన సందేహాల‌కు నివృత్తి దీనిలో ముఖ్య‌మైన అంశం. విదురుడు చాలా తెలివైనవాడు, యుద్ధం వినాశకరమైనదని అతనికి ముందే తెలుసు. అతను అప్పటికే ధృతరాష్ట్రునికి యుద్ధ ఫలితాన్ని గురించి తెలియజేసాడు. మానవ సమాజ శ్రేయస్సుకు సంబంధించిన అనేక విషయాలను విదుర నీతిలో పేర్కొన్నాడు. ఈ క్ర‌మంలోనే విదురుడు అదృష్ట చిహ్నాల గురించి చెప్పాడు. అవి ఏంటో తెలుసా?


మ‌ధురంగా మాట్లాడేవారు


ఎదుటి వ్య‌క్తితో మధురంగా మాట్లాడే వారికి అదృష్టం ఎప్పుడూ అండగా ఉంటుందని విదుర నీతి చెబుతోంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎవరి మనసునైనా సులభంగా గెలుచుకోగలడు. అలాంటి వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. ఒక వ్యక్తి తన మాట తీరుపై తగిన శ్రద్ధ వహించాలి. అందరికీ ఆనందం కలిగించే విధంగా మాట్లాడాలి. మాట మధురంగా ​​ఉండాలి. అప్పుడే అతని మాటలను అందరూ వింటారు. మధురమైన మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి. మధురంగా మాట్లాడేవారు మరింత పురోగతిని సాధిస్తారు. అలాంటి వారికి ఇతరుల నుంచి ఆప్యాయత, సహకారం కూడా లభిస్తాయి. మధురంగా మాట్లాడేవారిని శత్రువులు కూడా కొనియాడ‌తారు.


Also Read : మహాభారతం నేర్పే ఐదు జీవిత పాఠాలు


విధేయులైన పిల్ల‌లున్న త‌ల్లిదండ్రులు


ఎవరి పిల్లలు విధేయులుగా ఉంటారో వారి జీవితాలు ఆనందంతో నిండి ఉంటాయి. ఎందుకంటే అలాంటి బిడ్డ తన తల్లిదండ్రులకు సమాజంలో కీర్తిని తెస్తుంది. కాబట్టి, అటువంటి విధేయత ఉన్న‌ పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. పిల్ల‌ల్లో చిన్న‌ప్ప‌టి నుంచే సద్గుణాలను పెంపొందించాలి. చదువుతో పాటు సద్గుణాలున్న పిల్లలు ఇతరులకన్నా తెలివైనవారిగా మారుతారు. పిల్లల్లో అబద్ధాలు చెప్పే అలవాటును పెంచకూడ‌దు. ఏ ప‌రిస్థితుల్లోనైనా ధైర్యంగా నిజం చెప్పేలా పిల్లలను ప్రోత్సహించాలి. 


ఆరోగ్య‌వంతుడు


వ్యాధులు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే వ్యక్తి కంటే అదృష్టవంతుడు ఎవరు..? ఎందుకంటే ఆరోగ్యవంతమైన వ్యక్తి మాత్రమే తన పనులన్నీ సక్రమంగా చేయగలుగుతాడు. జీవితంలో అన్ని ఆనందాలను అనుభ‌వించ‌గ‌లుగుతాడు. అందుకే ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తి కోటీశ్వ‌రుడితో స‌మాన‌మ‌ని అంటారు.


జ్ఞానులు


జ్ఞానం ఉన్నవారిని కూడా చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఎందుకంటే జ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేరు. జ్ఞానం ఎప్పటికీ అంతం కాదు. ఎవరికైనా ప్రతి క్లిష్ట సమయంలో జ్ఞానం మద్దతుగా నిల‌వ‌డంతో పాటు ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప‌రిష్కారం సూచిస్తుంది. అది గొప్ప ఆదాయ వనరుగానూ వారికి మారుతుంది.


చాణక్యుడి కాలంలో సివిల్-క్రిమినల్ నేరాలకు శిక్షలేంటో తెలుసా!


స‌ద్గుణ‌వ‌తియైన స్త్రీ


మంచి మర్యాద గల స్త్రీ నివసించే ఇంట్లో, ఆ ఇంటిలో నివ‌సించే వారు ఎప్పుడూ అభివృద్ధి చెందుతారు.
సద్గుణవతియైన భార్య,  తన  భర్త  ఆరోగ్యంగా  నూరేళ్లు చక్కగా  ఉండాలని  కోరుకుంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచ‌డం ద్వారా అంద‌రూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. సత్ప్రవర్తన గల స్త్రీ లక్ష్మీదేవి లాంటిది. ఆమె తన కుటుంబంలో ఆనందాన్ని మాత్రమే పంచాలని కోరుకుంటుంది.


ఈ ల‌క్ష‌ణాలున్న వారు చాలా అదృష్టవంతుల‌ని విదుర‌నీతిలో తెలిపాడు. ఇలాంటి ల‌క్ష‌ణాలున్న వారు త‌మ‌తో పాటు త‌మ చుట్టూ ఉన్న‌వారిని కూడా ఆనందంగా ఉంచుతార‌ని స్ప‌ష్టంచేశాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించగలరు.