Mahabharat: పంచ‌మ వేదంగా పేరొందిన మహాభార‌తంలో అనేక అంశాల‌కు సంబంధించిన వివ‌రాలు దాగి ఉన్నాయి. జీవితాన్ని ప్ర‌భావితం చేసే జ్ఞాన దీపం ఉంది. వ్య‌క్తి న‌డ‌వ‌డిక‌ సరైన మార్గంలో ఉంచే ఒక పాఠం ఉంది. అహం-పగ ఫలితాల‌ గురించి హెచ్చరిక ఉంది. అందుకే మహాభారతానికి స్వీయ గుర్తింపు, హోదా ఉన్నాయి. ఇందులో పేర్కొన్న అనేక విష‌యాలు నేటి స‌మాజానికి దిశానిర్దేశం చేస్తాయి. జీవితంలో చేయాల్సిన‌వి, చేయ‌కూడ‌న‌వి, ఉండాల్సిన‌వి, ఉండ‌కూడ‌ని ల‌క్ష‌ణాలు, గుణాల గురించి మహాభారతం స్ప‌ష్టంగా పేర్కొంది.


అసూయ, దురాశ వినాశన హేతువులు


అసూయ, పగ, దురాశ ఖచ్చితంగా జీవితాన్ని నాశనం చేస్తాయి. దీనికి మహాభారతమే ఉదాహ‌ర‌ణ‌. మహాభారతంలోని సంఘటనలు సమష్టిగా కురుక్షేత్ర యుద్ధం వరకు దారితీస్తాయి. అయితే, ఈ యుద్ధానికి ముందు ఎక్కువగా కనిపించేది అసూయ, దురాశ, పగ. ధర్మమార్గంలో నడుస్తున్న పాండవులను, వారి అభివృద్ధిని, ఆదరణను దుర్యోధనుడు చూడలేకపోయాడు. రాజ్యం కావాలనే దురాశ వేరు. పాండవులను నాశనం చేయాలనే ఈ అసూయ, దురాశ, పగ అత‌న్ని నిల‌వ‌నీయ‌లేదు. వారికి అధికారం ఇస్తే త‌న‌కు మనుగడ లేదు అని భావించి వారిని క‌ష్టాల‌పాలు చేయాల‌ని సుయోధ‌నుడు భావించ‌డంతో అత‌ని అసూయ‌, పేరాశ‌ కౌరవ వంశం మొత్తాన్ని నాశనం చేశాయి. ఈ విధంగా, ఈర్ష్య, ద్వేషం ప‌త‌నానికి దారితీస్తాయ‌ని మ‌హాభార‌తం నిరూపించింది.


Also Read: దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహం ఉందా - అయితే ఇదిగో క్లారిటీ!


ధ‌ర్మం కోసం నిలబడండి


జీవితంలో ఎప్పుడూ ధ‌ర్మం కోసం పాటుప‌డ‌టం చాలా ముఖ్యం. దీనిని మనం మహాభారతంలో చూడవచ్చు. కురుక్షేత్ర యుద్ధమే దీనికి నిదర్శనం. ఎంతో ధైర్యవంతుడైన‌ అర్జునుడు యుద్ధ‌భూమిలో తన బంధువుల‌తో, గురువుల‌తో ఎలా పోరాడాలో తెలియక తికమకపడ్డాడు. ఈ గందరగోళంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ భ‌గ‌వానుడు భ‌గ‌వ‌ద్గీత ఉపదేశించాడు. ప్రతి ఒక్కరూ ధ‌ర్మం కోసం నిలబడాలని కృష్ణుడు పార్థునికి యుద్ధభూమిలోనే జ్ఞాన‌బోధ చేశాడు. ధ‌ర్మ స్థాప‌న ఆవ‌శ్య‌క‌త గుర్తించిన అర్జునుడు గొప్ప యోధునిగా తన బాధ్యత నెరవేర్చాడు. శ్రీ‌కృష్ణుడు అర్జునుడికి ఈ ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే, ఇది ఎల్లప్పుడూ సత్యం, ధ‌ర్మ‌ విజయం అని కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.


అందమైన స్నేహం


మహాభారతంలో అందమైన స్నేహానికి రుజువులుగా అనేక సందర్భాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు- అర్జునుడి మ‌ధ్య‌ స్నేహ బంధం  అద్భుతమైనది. కృష్ణుడి స్నేహం, ప్రేమ పాండవులకు గొప్ప బలం. పాండవుల పట్ల దయగల ఆలోచనాపరుడిగా, అద్భుతమైన స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా శ్రీ‌కృష్ణుడు క‌నిపిస్తాడు. పాండవులు మాయాజూదంలో ఓడిపోయినప్పుడు కిక్కిరిసిన కౌర‌వ‌ సభలో ద్రౌపదికి అన్యాయం జరిగినప్పుడు ఆదుకున్నది శ్రీకృష్ణుడే. కౌరవుల శిబిరంలో కూడా దుర్యోధనుడు- కర్ణుడి మ‌ధ్య మైత్రీ బంధం ఒక అందమైన స్నేహానికి సాక్షి. ఆఖరి క్షణం వరకు తన స్నేహితుడి కోసం పోరాడినవాడు కర్ణుడు. అంటే మహాభారతంలో స్నేహం అంటే 'ఇలా ఉండాలి' అనే అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి.


అడ్డంకులు ఎదురైనా ధైర్యం వీడ‌కూడ‌దు


కౌరవుల శిబిరంలో ఉన్నప్పటికీ, క‌ర్ణుడు తన గుణం ఆధారంగా అంద‌రినీ ఆక‌ట్టుకుంటాడు. కర్ణుడు దానధర్మాలకు పేరొందాడు. అలాగే జీవితంలో అడ్డంకులు ఎదురైనా ఎలా జీవించాలో అత‌నే ఉదాహరణ. ''సూత పుత్రుడు'' అన్న సూటిపోటి మాటలు పుట్టినప్పటి నుంచి వింటూ, ప్రతి స్థాయిలో వివక్ష, అవమానాలను భరించిన‌వాడు కర్ణుడు. కానీ, వాట‌న్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ జీవించాడు. అతను తన లక్ష్యాన్ని చేరుకోవడంపై మాత్రమే దృష్టిసారించాడు. స్నేహానికి పేరుగాంచిన కర్ణుడు దాతృత్వానికి కూడా మారుపేరుగా నిలిచాడు. మారు వేషంలో వ‌చ్చిన‌ ఇంద్రుడు కవచ కుండలాలు ఇవ్వాల‌ని అడిగితే. అది ఇస్తే ప్రాణం పోతుంద‌ని తెలిసినా దాన‌మిచ్చిన ధీరుడు కర్ణుడు.


Also Read: మీ ఇల్లు ఇలా ఉంటే పర్సులో పైసా కూడా నిలవదు - డబ్బులు నీళ్లలా ఖర్చవుతాయ్


భవిష్యత్ ప్రణాళిక


మహాభారతం నుంచి మనం నేర్చుకోవలసిన మరో పాఠం సరైన ప్రణాళిక. సంతోషకరమైన, నిజాయితీగల జీవితం కోసం మన భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. దీనికి ఉదాహరణ శ్రీ కృష్ణుడు. కౌరవుల నుంచి పాండవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు తెలివిగా ప్రణాళికలు రచించాడు. మ‌న జీవితానికి ఇది చాలా ముఖ్యమైనది. ఏదైనా పనికి ముందు బ్లూప్రింట్ తయారు చేయడం, సరిగ్గా సిద్ధం చేయడం, స‌రైన కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌డం ఏ కాలంలోనైనా చాలా ముఖ్యం. మీరు ప్రణాళిక లేకుండా బయలుదేరిన తర్వాత, జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. భవిష్యత్తు అగ‌మ్య‌గోచ‌రంగా ఉంటుంది. అంతేకాకుండా, ఉన్న‌త వ్య‌క్తుల‌ సహవాసం కూడా చాలా ముఖ్యమైనది. ఈ సంద‌ర్భంలోనూ మ‌హాభారతంలో శ్రీ‌కృష్ణుడే ఉదాహ‌ర‌ణ‌. కౌరవుల సహవాసం దుర్మార్గులతో కొన‌సాగితే.. శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు, విదురుడు వంటి సజ్జనుల సహవాసం ద్వారా పాండవులు ధర్మమార్గాన్ని అనుసరించారు.