వాస్తు ప్రభావితం చెయ్యని అంశం జీవితంలో లేదని చెబితే అతిశయోక్తి కాదు. ఒక్కోరకమైన దోషం ఒక్కో రకంగా జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కొంత మందికి ఏంచేసినా కలిసి రాదు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడలేరు. మరి కొంత మంది ఎంత కష్టపడి పని చేసినా, డబ్బు సంపాదించినా అది రాశికి రాదు. నిలిచి ఉండదు. ఎప్పుడు చూడు డబ్బుకు ఇబ్బందే. ఇలా జరిగేందుకు వాస్తు కారణం కావచ్చు. ఎలాంటి వాస్తుదోషాల వల్ల ఇలాంటివి జరుగుతాయో చూద్దాం.  


వాస్తు ఇలాంటి అనేక విషయాలపై పరిజ్ఞానాన్ని ఇస్తుంది. మనం నివసిస్తున్న చోటు లేదా పని చేస్తున్న చోటులో వాస్తు దోషాల కారణంగా ఆర్థిక సంక్షోభం వెంటాడవచ్చు. తెలిసీ తెలియక చేసే పొరపాట్ల వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడుతాయి. తెలియకుండానే క్రమంగా పేదరికం ఆవహిస్తుంది. ఇలా డబ్బుకు సంబంధించి వాస్తు నియమాలు, దోష పరిహారాల గురించి ఒక సారి తెలుసుకుందాం.



  • ఇంట్లో పేరుకుపోయిన మురికి వల్ల దోషాలు కలుగుతాయి. ఇంట్లో సాలెపురుగులు, వాటి గూడులు, చెత్తా చెదారం, పనికిరాని వ్యర్థాలు పేరుకుపోతే ఇంట్లో ప్రతికూలతకు కారణం అవుతుంది. లక్ష్మీ దేవి ఇలాంటి వాతావరణంలో ఒక్క నిమిషం కూడా నిలవదు. కనుక ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి. సాలీడుల వంటివి చేరకుండా జాగ్రత్త పడాలి.

  • సాధారణంగా ఇంటి ఆవరణలో లేదా బాల్కనీల్లో మొక్కలు పెంచుకుంటారు. ఇలా పెంచుకుంటున్న మొక్కలు కొన్ని ఎండిపోతుంటాయి. మొక్కలకు పూసిన పూలు వాడిపోతుంటాయి. ఇలా వాడిపోయిన పూలు, ఎండిపోయిన మొక్కలను వెంటనే తొలగించాలి. ఆరోగ్యంగా ఉన్న మొక్కలు, పూర్తిగా వికసించిన పువ్వులు సమృద్ధికి చిహ్నాలైతే ఎండిపోయిన మొక్కలు, వాడిన పువ్వుల నుంచి నెగెటివిటి చేరుతుంది. పూజలో ఉపయోగించిన పూవ్వులు వాడిపోయినవి వెంటనే తీసెయ్యాలి. పచ్చగా కళకళాడే గార్డెన్ సమృద్దికి ప్రతీక.

  • మంచం కింద ఏముందో కనిపించదు. కనుక పెద్దగా దాని మీద దృష్టి పెట్టం. కానీ మంచం కింద చెత్త చేరకుండా చూసుకోవాలి. చీపురు, విడిచిన బూట్లు, సాక్సులు లేదా చెప్పులు ఎప్పుడూ మంచం కింద పెట్టుకోకూడదు. మంచం కింద జంక్ చేరకుండా జాగ్రత్త పడడం అవసరం. ఇల్లు శుభ్రం చేసే ప్రతిసారీ మంచం కింద తప్పనిసరిగా తుడవాలి.

  • ఆగిపోయిన గడియారాలు ఇంట్లో అభివృద్ధికి ఆటంకాలని మరచిపోవద్దు. ఆగిపోయిన గడియారాన్ని బాగు చెయ్యడం లేదా తీసెయ్యడం మంచిది. ఇలా ఆగిపోయిన వాచీలు ఇంట్లో ఉంచుకుంటే ఆర్థిక సంక్షోభాలు వెంటాడుతాయి. కనుక ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి. విరిగిన షో పీసులు, నడవని గడియారాలు ఎప్పటికీ మంచిదికాదు వీటిని తొలగించాలి.

  • ఇంట్లో నీటిని పొదుపుగా వాడాలి. నీటి వృథా తగదు. నీళ్లు వృథా చేసే ఇంటిలో లక్ష్మి నిలవదు. ట్యాప్ లీకేజి, నీళ్ల ట్యాంక్ లీకేజి వంటి సమస్యలు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి. లేదంటే ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి


Disclaimer : ఇక్కడ అందించిన సమాచారం కేవలం విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ఏబీపీ దేశం ఎలాంటి భాధ్యత తీసుకోవదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి విరాలు తెలుసుకోగలు. ఏబీపీ దేశం ఈ విషయాలను దృవీకరించడం లేదు.