ఇల్లంతా వాస్తు నియమానుసారం చాలా పద్ధతిగా నిర్మించుకుంటాం. వస్తువులను కూడా వాస్తు ప్రకారమే సర్దుకుంటాం. మరి వాస్తు నియమాలు అన్నీ సక్రమంగా పాటించినా.. కష్టాలు ఎందుకు వెంటాడుతున్నాయని చాలామంది తలలు పట్టుకుంటారు. ఇందుకు వారు చేసే చిన్న చిన్న తప్పిదాలే కారణం కావచ్చు.
మిమ్మల్ని కష్టాలు వేదిస్తుంటే.. తప్పకుండా మీరు మరోసారి వాస్తును సరిచూసుకోవాలి. మీ ఇంటి మిద్దెతో సహా పరిసరాలన్నీ పరిశీలించాలి. ఇంటి టెర్రాస్ మీద చెత్త చేరితే ఇంతే సంగతులు అంటోంది వాస్తు. ఇంటి పైకప్పు మీద వాడని వస్తువుల పోగెయ్యటం, చెత్త చేరినా పట్టించుకోవడం లేకపోతే ఇంట్లో వారి అభివృద్ధికి ఆటంకాలు కొని తెచ్చుకున్నట్టే. ఇంట్లో గొడవలు పెరిగి మన:శాంతి కరువవుతుంది.
వాస్తు నియమాలను అనుసరించి ఇంటి పైకప్పు మీద ఎల్లప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. డాబా మీద విరిగిపోయిన, పాడైపోయిన, వాడని వస్తువులు పడెయ్యడం మంచిది కాదు. ఇలా చేస్తే ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం నుంచి కుటుంబసభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాల వరకు అన్నింటి మీద వ్యతిరేక ప్రభావాలు పడతాయి. ఇంటి మీద చేరిన చెత్త సామాన్లను తొలగించకపోతే వాస్తు దోషాలతో పాటు పితృదోషాలు కూడా పీడిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంటి వాతావరణం పాడైపోతుంది. అభివృద్ధి నిలిచి పోతుంది. ఆర్థిక నష్టాలు కలుగుతాయి.
పాడైపోయిన లేదా పనికిరాని సామాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో లేదా డాబా మీద ఇలా ఎక్కడా పెట్టుకోకూడదు. వెంటనే వాటిని ఇంటి బయటకు పంపెయ్యాలి. ఎప్పుడైనా పనికి వస్తాయనుకునే వస్తువులను డాబా మీద పడెయ్యకూడదు. అలాంటి వస్తువుల ఏవైనా ఉంటే వాటిని ఏదైనా వస్త్రంలో చుట్టి జాగ్రత్త చేసుకోవాలి. కానీ డాబా మీద పడెయ్యకూడదు.
డాబా మీద ఎప్పుడూ శభ్రంగా ఉండేలా చూసుకోవాలి. డాబా మీద ఏవైనా వస్తువులు పెట్టాలని అనుకున్నా చెత్త కుప్పలాగా వెయ్యడం మంచిదికాదు అక్కడ పెట్టిన వస్తువులు కూడా ఒక క్రమపద్ధతిలో అందంగా శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్త పడాలి. పంచభూతాల నుంచి వచ్చే ఎనర్జీ ని సరిగ్గా గ్రహించి మంచి ఫలితాలు అందించే కొన్ని వాస్తు టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
- తూర్పు వైపు ఉండే కిటికి నుంచి ఎండ ఎక్కువగా ఇంట్లోకి ప్రసరించే విధంగా ఉండాలి. ఇలా ఉన్నపుడు ఇంట్లోకి ఐశ్వర్యం ప్రవేశిస్తంది. ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు సింహ రాశికి అధిపతి.
- ఈశాన్యం కేతు దిశ. ఈ దిక్కున గుమ్మనికి పక్కగా మెట్లు ఉండకూడదు. ఇలా ఉండడం దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది.
- ఈశాన్యం బృహస్పతి స్థానం కనుక దిక్కున పూజ గది ఉండడం మంచిది.
- ఉత్తరం, తూర్పు రెండు కూడా మెయిన్ ఎంట్రెన్స్ కు అనువైనవి. కానీ డోర్ పక్కన చెప్పుల రాక్ ఉండడం మంచిది కాదు. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తుంది.
- 3 కంటే ఎక్కువ ఎంట్రెన్స్ డోర్స్ ఉండడం అన్ లక్కీ. ఇది సమస్యలకు ఆహ్వానం పలకడమే.
- ఇంట్లో నదులు, సముద్రాలు, పువ్వుల తోటలు, మొక్కల పేయింటింగ్స్ ఉంటే అవి గుడ్ లక్ ని ఆహ్వానిస్తాయి.
- ఆగ్నేయం ఆగ్ని కొలువుండే దిక్కు. అందువల్ల ఇటు వైపు కిచెన్ ఉండడం మంచిది. వంట చేసే వారు తూర్పు దిక్కుగా నిలబడే విధంగా ఉండేలా ప్లాట్ ఫాం నిర్మించుకోవాలి.
- ఇంట్లో పనిచేయని గడియారాలు ఉంటే వెంటనే తీసి పడేయ్యండి. ఇవి ఇంట్లో నివసించే అందరి మీద నెగెటివ్ ప్రభావం ఉంటుంది. ఈశాన్యానికి బృహస్పతి అధిపతి. అందువల్ల అటువైపు తప్పనిసరిగా దేవుడి ఫోటోలు పూజస్థానం ఉండేలా చూసుకోవాలి. అయితే దేవుడి విగ్రహాలు లేదా పటాలు తూర్పు అభిముఖంగా ఉండాలి.
- హింసను ప్రతిబింబించే చిత్రాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి ఇంటిలోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తాయి.
- చంద్రుడు వాయువ్యాధిపతి ఈ దిక్కులో వ్యర్థాలు పడెయ్య కూడదు. చీకటిగా కూడా ఉండకూడదు. ఇలా చేస్తే ఇంట్లోని స్త్రీలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.