Vijayasai Reddy Tweet on Tdp Janasena And Bjp Alliance: వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. 2014 - 19 మధ్య కాలంలో రాష్ట్రానికి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్ధాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది.? అంటూ ప్రశ్నించారు. ఇది మరో ప్యాకేజీతో ఏర్పడిన పొత్తు అని మండిపడిన ఆయన.. మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు. 'ఏపీలో సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటు వెయ్యాలి.' అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అటు, ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో సీఎం జగన్ ప్రచారంలో వేగం పెంచారు. 'వైనాట్ 175' లక్ష్యంగా తమదైన రీతిలో ప్రజలతో మమేకమవుతున్నారు.
అటు, పవన్ కాపులను మోసం చేశారని ఏపీఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. తాను సీఎం కాలేనని, చంద్రబాబుకే సీఎం అయ్యే అర్హత ఉందని పవన్ చెబుతున్నారని.. చంద్రబాబుకు కాపులందరూ ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. ముద్రగడను చంద్రబాబు వేధించినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కాపులను తిట్టిన వారితో పవన్ ఎందుకు కలిశారని అన్నారు. కాపు సోదరులను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంత దగా చేస్తున్నారో గుర్తించాలని పేర్కొన్నారు.
ఆ పొత్తు ఖరారు
అటు, టీడీపీ ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. అధికారిక ప్రకటనే తరువాయి. గురువారం రాత్రి జరిగిన చర్చల్లో ఇరు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఇన్ని రోజులు సాగిన పొలిటికల్ సీరియల్‌కు ఇవాళ పుల్‌స్టాప్ పడనుంది. 2014 సీన్ ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కానుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై కూడా ఓ అవగాహనకు వచ్చాయని సమాచారం. మూడు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేయనున్నాయి. 175 అసెంబ్లీ సీట్లన్న ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ కలిసి 30 స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. 25 పార్లమెంట్ సీట్లలో 8 సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే... మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. జనసేనకు ఇప్పటికే మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు. అంటే ఐదు ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ పడనుంది. అదే టైంలో 24 ఎమ్మెల్యే సీట్లలో జనసేన పోటీ చేయనుంది. ఆరు సీట్లు బీజేపీకి కేటాయించనున్నారు. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ, జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు.