Election Code of Conduct In Andhra Pradesh: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పరచుకుని ఉండాలన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల ప్రతినిధులు అనుసరించాల్సిన విధివిధానాలను వివరించేందుకు రాష్ట్ర సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక అంశాలను ఆయా పార్టీల నేతలకు వివరించారు.


ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ పర్యవేక్షణ ఎంతో కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. ఈ అంశాలపై సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ మాత్రమే ఐదారు రోజుల తర్వాత వస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు.


ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందని వివరించారు. ఎటువంటి బహిరంగ కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి పొందాలని, పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే అన్ని కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్ధమన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు 50 వేలకు మించి నగదు, పదివేలకు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్ధం అని స్పష్టం చేశారు. స్టార్ క్యాంపైనర్లు లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదని, పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను శీజ్ చేస్తామని స్పష్టం చేశారు.


నామినేషన్ల ప్రక్రియ అప్పుడే ప్రారంభం


ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్థులు 25,000 శాసనసభ అభ్యర్థులు 10,000 నగదు రూపేనా లేదా ఆర్బిఐ/ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. చెక్కులు, బ్యాంకు డ్రాఫ్ట్ లు అనుమతించబోమని వెల్లడించారు. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారని, నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు వాహనాలను 100 మీటర్ల దూరంలో నిలిపివేస్తామని స్పష్టం చేశారు మీనా. అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని, ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందన్నారు.


ప్రతి లోక్సభ అభ్యర్థికి 95 లక్షలు, శాసనసభ అభ్యర్థికి 40 లక్షలు వ్యయం చేసేందుకు అనుమతి ఉందన్నారు. ఈ వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, బహుమతులు, లిక్కరు, ఇతర వస్తువులను పంపిణీ చేయడానికి చట్ట విరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తామని వివరించారు. ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. రోజువారి రిజిస్టర్ తోపాటు నగదు, బ్యాంకు రిజిస్టర్లను కూడా తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన సూచించారు.  ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉండేలా చూడాలని కోరారు.


మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వారిని వినియోగించుకుంటున్నారని, తాయిలాలు, బహుమతులు అందిస్తున్నారని ఈ సందర్భంగా మీనా దృష్టికి ఆయన తీసుకువచ్చారు. వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేసే అవకాశం ఉందన్నారు. ఈ వర్క్ షాప్ లో అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎం.ఎన్ హరేందర్ ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి (వైసీపీ), ఏ రాజేంద్రప్రసాద్ (టిడిపి), ఐకే అన్నపూర్ణ (బిజెపి), వైవి రావు సిపిఐ (ఎం)పాల్గొన్నారు.