Andhra Pradesh News: వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా? లేదా పార్లమెంట్‌కు పోటీ చేస్తారా? అసెంబ్లీకి పోటీ చేస్తే ఏ స్థానాన్ని ఎంచుకుంటారు?  ఒకవేళ లోక్‌సభకు వెళ్లాలనుకుంటే ఏ సీటును ఎంపిక చేసుకుంటారు? ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు దీని గురించే పెద్ద చర్చే జరుగుతోంది. ఎక్కడ పొగోట్టుకుంటారో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లు.. గత ఎన్నికల్లో భీమవరం నుంచి ఓటమి పాలైన పవన్.. ఈ సారి మళ్లీ అక్కడి నంచి పోటీ చేసి సత్తా చాటుతారా? లేదా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? పవన్ పోటీపై క్లారిటీ రాకపోవడంతో జనసైనికులు అయోమయంలో పడ్డారు.


భీమవరం సీటు కోసం పోటీ


అయితే టీడీపీ-జనసేన కూటమిలో భాగంగా భీమవరం సీటుకు పోటీ నెలకొంది. అక్కడ గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పులపర్తి రామాంజనేయులు మళ్లీ సీటు కోసం పట్టుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాను సహకరిస్తానని, లేకపోతే తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. భీమవరం నుంచి గత ఎన్నికల్లో పవన్ పోటీ చేయడంతో.. ఈ సారి కూడా ఆ సీటును జనసేన ఆశిస్తోంది. దీంతో జనసేనకు ఆ సీటు కేటాయిస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పులపర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న పులపర్తి.. ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. ఇటీవల పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఆయన.. భీమవరం సీటు విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం పులపర్తి మాట్లాడుతూ.. పవన్ పోటీ చేయకపోతే తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయనను కోరినట్లు తెలిపారు.


జనసేనతో టచ్‌లోకి..


టీడీపీ నుంచి సీటు కష్టమని భావించిన పులపర్తి రామాంజనేయులు గత కొంతకాలంగా జనసేనతో టచ్‌లో ఉంటున్నారు. తాడేపల్లిలో జరిగిన జెండా సభలో కూడా వేదికపై జనసేనకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. దీంతో ఆయన జనసేనలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. అయితే భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలని కోరుతున్న జనసైనికులు.. వేరేవారికి అయితే సహకరించేది లేదంటూ చెబుతున్నారు. పులపర్తికి టికెట్ ఇవ్వొద్దని పవన్‌ను కోరుతున్నారు. పవన్‌ను వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో గెలిపించేందుకు ఇన్నాళ్ల నుంచి పార్టీ కోసం పనిచేశామని, వేరేవారు పోటీ చేస్తే సహకరించమని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. దీంతో ఈ సీటు విషయంలో టీడీపీ, జనసేన కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


కాంగ్రెస్ నుంచి ఒకసారి.. టీడీపీ నుంచి ఒకసారి


పులపర్తి రామాంజనేయులు భీమవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గ్రంధి శ్రీనివాస్ ఉన్నారు. అయినా ఆయను కాదని పులపర్తికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కనకరాజు సూరిపై 22 వేలకుపైగా ఓట్లతో పులపర్తి గెలుపొందారు. ఇక 2014 ఎన్నికలకు ముందు పులపర్తి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌పై 13 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున మరోసారి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.