Ysrcp Leader Kethireddy Venkatarami Reddy Clarity On Party Changing: ఇటీవల వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు వరుసగా ఆ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. అనంతరం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు. ఇక, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మరికొందరి నేతలు సైతం పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు మాజీ మంత్రి విడదల రజని కూడా జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపారనే ప్రచారం సాగింది. అయితే, దీనిపై స్పందించిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పూర్తి క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉంటూ జగన్ వెంటే నడుస్తానని.. పార్టీ మారేది లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. 


'జగన్‌తోనే నా ప్రయాణం'


వైఎస్ జగన్‌తోనే తన ప్రయాణం అని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy venkatarami Reddy) స్పష్టం చేశారు. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతో ఉంటున్నామని.. ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ తాను వైసీపీలోనే జగన్‌తోనే ఉంటానంటూ క్లారిటీ ఇచ్చారు. ఎల్లవేళలా జగన్ కుటుంబానికి తోడుగా ఉంటామన్నారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులే బయటకు వెళ్లారు కానీ తాము మాత్రం జగన్‌తోనే ప్రయాణం చేస్తామన్నారు. తాము పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. తనను నమ్ముకున్న వారి కోసం రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. 


వైసీపీని వీడుతున్న కీలక నేతలు


మరోవైపు, వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలినేని, సామినేని ఉదయభాను ఆ పార్టీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంకా కొందరు నేతలు సైతం జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంతమంది నేతలు వచ్చినా.. కూటమి పార్టీలతో చర్చించిన అనంతరమే చేరికలపై స్పష్టత ఇవ్వాలని జనసేన భావిస్తున్నట్లు సమాచారం. అటు, బీజేపీతోనూ కొందరు నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.


వైసీపీకి భవిష్యత్ లేదని.. జగన్‌కు విశ్వసనీయత లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం పవన్‌తో భేటీ అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసం ఆనాడు రాజీనామాలు చేసినా.. ఆ తర్వాత తమను పట్టించుకోలేదని చెప్పారు. పదవి అవసరం లేదని.. గౌరవం చాలని అన్నారు. ఒంగోలులోనే చేరిక కార్యక్రమం ఉంటుందని.. మంచిరోజు చూసుకుని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరుతానని స్పష్టం చేశారు. అటు, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్ విధానాలు నచ్చకే పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. రాజకీయ జీవితంలో తనతో పాటు కలిసి ప్రయాణించిన వారిని జనసేనలోకి ఆహ్వానించారు. పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని.. కూటమికి తగ్గట్టు వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటానని చెప్పారు. 


Also Read: Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?