YS Jagan's key decisions in 2022: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది (2022) పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కీలకంగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం.. మంత్రి వర్గ విస్తరణ ఇదే ఏడాది జరిగాయి. ఒకవైపు పార్టీ, మరో వైపు ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారు.
నాలుగో ఏడాదికి ఎంట్రీ...
ఈ ఏడాదితో వైసీపీ ప్రభుత్వం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టింది. 2022 లో పార్టీ, ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఒక వైపు సీఎంగా, మరోవైపు పార్టీ అధ్యక్షుడుగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఈ  ఏడాది మే నెలలో ప్రారంభం అయింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడమే ప్రధాన  ఉద్దేశంగా గడప గడపకు కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రజల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమలు. ప్రజలకు వివరించి ఒక పాంప్లేట్ ఇవ్వాలనే జగన్ సూచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ప్రారంభం సాగుతోంది. ఇప్పటికే గడప గడప కు వైసీపీ కార్యక్రమం పై సీఎం జగన్ సమీక్షలు నిర్వహించారు. వచ్చే మార్చి నెలలో గడప గడపకు ప్రభుత్వంపై చివరి సర్వే నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ...
కీలకమైన మంత్రి వర్గ విస్తరణ ఈ ఏడాదే జరిగింది. సీఎం జగన్ మొదట చెప్పినట్టు కొంతమంది పాత మంత్రుల స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. పూర్తిగా మంత్రి వర్గాన్ని మార్చుదామనుకున్నా సామాజిక, రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మొదటి కాబినెట్ లోని మంత్రులను రెండో క్యాబినెట్‌లోనూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు జగన్. ఇది పార్టీలో వ్యతిరేకతకు దారితీసినప్పటికి జగన్ వాటిని చాలా ఈజీగా ఓవర్ కమ్ చేశారు. అలక వహించిన పార్టీ సీనియర్లను ఆయన తక్కువ సమయంలోనే బుజ్జగించగలిగారు.
పెన్షన్ల పెంపు...
ఇక ప్రభుత్వం ఈ ఏడాది సామాజిక పెన్షన్లను మరో రూ. 250 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు  2750 రూపాయలు రానున్నాయి. ఎన్నికల హామీలో ఇచ్చిన మాట కోసం ఏడాదికోసారి జగన్ పెన్షన్ పెంపుదలపై నిర్ణయం తీసుకుంటున్నారు. పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీని వలన వచ్చే ఎన్నికల్లో ఫలితాలు పై ప్రబావం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం కొన్ని అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ, సుప్రీంకోర్టులో మూడు రాజధానులకు సంబంధించి పిటిషన్లు వెయ్యడం ఇలా కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టింది.
పార్టీ పరంగా జగన్ కీలక నిర్ణయాలు...
ఇక పార్టీ పరంగా ఈ ఏడాది చాలా కీలకం అనే చెప్పాలి. పార్టీ ప్లీనరీ సమావేశాలు ఈ ఏడాది జులై నెలలో నిర్వహించారు. ఇదే ప్లీనరీలో విజయమ్మ పార్టీ గౌరవ అద్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. బీసీ ఎస్సి ఎస్టీ మైనారిటీ మంత్రుల బస్ యాత్ర.. బిసి సామాజిక వర్గాల సభ జయహో బీసీ ఇదే ఏడాది జరిగాయి. ముఖ్యంగా పార్టీ ప్రభుత్వం రెండు కలిసి సమన్వయం చేసుకుంటూ మూడు రాజధానులు అంశం పై సభలు.. సమావేశాలు నిర్వహించాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానులకు మద్దతుగా సభలు గర్జనలు నిర్వహించి మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్టుగా నేతలు మంత్రులు ప్రకటనలు చేశారు. 
నియోజకవర్గాల్లో పరిశీలకుల నియామకం జరిగింది. పార్టీ పరంగా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఎమ్మెల్యేల పనితీరు జనంలో తిరగడంపై పరిశీలకులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తారు. జగన్ సూచనల మేరకు పరిశీలకుల పనితీరు ఉండనుంది. ఇటీవలే జరిగిన సమావేశంలో గృహ సారథులు.. గ్రామ వార్డ్ సచివాలయంలో ప్రత్యేక సమన్వయ కర్తల నియామకం జరగాలని సీఎం జగన్ నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరులోగా వీరి నియామకం పూర్తి కావాలి. కానీ ప్రస్తుతం వీరి నియామకం ఆలస్యం కావడంతో సంక్రాంతి లోపు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.


మొత్తంగా 2022లో సీఎం జగన్ ఒక వైపు పార్టీని, మరో వైపు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. 2023 కూడా ఆ పార్టీకి కీలక సంవత్సరమే. 2023 కొత్త ఏడాది లో తీసుకునే నిర్ణయాలు ఎన్నికలను కూడా ప్రభావితం చేసే విధంగా ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలపై అంచనాలు పెరిగిపోతున్నాయి.