TDP Senior Leaders : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మొహమాటాలు వదిలేశారు. ఈ సారి నాన్చుడు కూడా ఉండటం లేదు. చెప్పాలనుకున్నది చెప్పేస్తున్నారు. ఇదీ టీడీపీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఈ మొహమాటాలు, నాన్చుడు దేని కోసం అంటే.. టిక్కెట్ల కోసం. గతంలో పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నారన్న కారణంగా ప్రజల్లో పట్టు కోల్పోయినా గెలుపు అవకాశాలు లేకపోయినా చంద్రబాబు చాన్సులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం అలాంటి అవకాశమే లేదని చంద్రబాబు సూటిగా చెబుతున్నారని టీడీపీ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.
పార్టీలో పాతుకుపోయిన సీనియర్లను ఎన్నికల బరి నుంచి తప్పించే యోచన
విజయవాకాశాలను బేరీజు వేసుకుంటున్న టీడీపీ అధినేత ఇకపై మొహమాటానికి పోకూడదని తీర్మానించుకున్నారు. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినంత మాత్రన టికెట్ ఖాయమన్న ఆలోచన వద్దంటున్నారు. నియోజవర్గాల సమీక్షల్లోనూ తనతో వ్యక్తిగత చర్చల్లోనూ ఆయన ఇదే మాట తెగేసీ చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాల లెక్కన గత ఎన్నికల ఫలితాలను చూసుకుని టికెట్ ఇవ్వాలా వద్దా అని తీర్మానించుకుంటున్న చంద్రబాబు ఆ సంగతి నేరుగా ఆశావహులకే చెప్పేస్తున్నారు జిల్లాల టూర్ సందర్భంగా సమీక్షలు నిర్వహిస్తూ టికెట్ల పంచాయతీని కూడా తీర్చేస్తున్నారు. అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారని అంటున్నారు.
పలువురు సీనియర్లకు ముందుగానే సమాచారం !
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ విషాదాల వల్ల యాక్టివ్ గా లేరు. ఈ సారి ఏలూరు ఎంపీ టిక్కెట్ కు ఆయనను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కుదిరితే ఏదైనా అసెంబ్లీ స్థానంలో టిక్కెట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఎక్కడా చాన్స్ ఉండదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. మాగంటి బాబు కూడా తన ఇద్దరు కుమారుల్ని కొద్ది నెలల తేడాతో కోల్పోయి నిరాశలో ఉన్నారు. రాజకీయాన్ని తట్టుకోలేనేమో అన్న ఆలోచనలో ఉన్నారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు మాజీలకు టికెట్లు లేవని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలోనూ పలువురు సీనియర్లకు ఈ సారి టిక్కెట్ డౌటేనని చెబుతున్నారు. యనమల రామకృష్ణుడు చాలా కాలంగా ప్రత్యకంగా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. అయితే ఈ సారి ఆయన కుటుంబ సభ్యులకూ చాన్స్ లేదని టీడీపీ అధినేత క్లారిటీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వంపై పోరాడని వాళ్లకూ చంద్రబాబు నుంచి బ్యాడ్ న్యూసే !
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను తీవ్ర వేధింపులకు గురి చేసింది. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజా చైతన్యం తీసుకురావడంలో విఫలమైన వారికి టికెట్టిచ్చేది లేదని సూత్రప్రాయంగా చంద్రబాబు డిసైడయ్యారు. అందులో రాయలసీమ ప్రాంత నేతలు ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు మొక్కుబడిగా ఒకటి రెండు ధర్నాలు చేయడం మినహా పార్టీ కార్యకర్తలను సంఘటితంగా ఉంచడంలో విఫలమైన మాజీలే ఎక్కువమంది ఉన్నారని టీడీపీ అధిష్టానం లెక్కగట్టింది. కొందరికి టికెట్ లేదని చెబుతున్న చంద్రబాబు మరికొందరికి మాత్రం టికెట్ ఖాయమని నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే సమర్థంగా పనిచేయాలని సూచిస్తున్నారు. గెలిచే అవకాశం ఉన్న తటస్థులను తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గుడివాడలో రాము అనే ఎన్నారై పని కూడా ప్రారంభించారు. ఇలాంటి వారు ఇంప్రెస్ చేస్తే వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే.. చంద్రబాబు గతంలో చెప్పినట్లు ఆయనకు చివరి ఎన్నికలు అవుతాయి. అందుకే ఈ సారి మొహమాటల్లాంటివేమీ పెట్టుకోకుండా దూకుడుగా ముందుకెళ్తున్నారు.