Peddareddy Vs JV Prabhakar Reddy:తాడిపత్రిలో పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోకి వచ్చినప్పటికీ భవిష్యత్‌లో ఎప్పుడైనా మరోసారి ఘర్షణలు జరిగే ప్రమాదం లేకపోలేదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన కామెంట్స్‌ అందుకు సాక్ష్యంగా మారుతున్నాయి. తాను కచ్చితంగా తాడిపత్రిలోనే ఉంటానంటున్న వైసీపీ నేత... జేసీ అరాచకాలపై పోరాటం కొనసాగిస్తానంటూ చెప్పుకొచ్చారు. 


ఎన్నికల అనంతరం చాలా కాలం తర్వాత తొలిసారి పెద్దారెడ్డి తాడిపత్రి రావడంతో ఒక్కసారి ఆ ప్రాంతం భగ్గమంది. ఆ ప్రాంతంలోకి పెద్దారెడ్డి వస్తే ఘర్షణలు తలెత్తి ప్రమాదం ఉందని చెప్పినా ఆయన రావడంతో టీడీపీ వర్గీయులు తిరుగుబాటు చేశారు. అధికారుల అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ ఆయన్ని నిలదీసేందుకు పెద్దారెడ్డి ఇంటి వైపుగా వెళ్లారు. పోలీసులు కలుగు చేసుకోవడంతో అక్కడ ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. 


పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన జేసీ అనుచరులు దాడికి యత్నించారు. ఇంతలో ఆయన వెళ్లిపోయారని తెలుసుకొని వెళ్లిపోతున్న టైంలో వైసీపీ లీడర్‌, పెద్దారెడ్డి అనుచరుడు మురళి గన్ చూపించి కవ్వింపు చర్యలకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి తనకు కావాల్సిన కొన్ని పత్రాల కోసం తీసుకొని వెళ్లిపోయినప్పటికీ పరిస్థితులు వేడెక్కాయి. వైసీపీ టీడీపీ శ్రేణులు దాడులు చేసుకున్నారు. కందిగోపుల మురళి ఇంటిని, కార్లను ధ్వంసం చేశారు. 


వీటన్నింటిపై స్పందించిన పెద్దారెడ్డి తాను ఇలాంటి వాటికి భయపడే వాడిని కానన్నారు. చట్టపరిధిలో ఏం చేయాలో అది చేస్తానని అన్నారు. జేసీ అక్రమాలపై పోరాడుతూనే ఉంటానని చెప్పారు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన నేతలకు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ దాడిలో వద్ద రఫీ అనే వైపీసీ కార్యకర్తపై దాడి చేశారని అందకే తమ కార్యకర్తలు తిరగబడ్డారని పెద్దారెడ్డి చెబుతున్నారు. అధికారంలో ఉన్న జేసీ అరాచకాలపై పోరాడానని తనపై కక్ష పెంచుకున్నారని అన్నారు. జేసీ బ్రదర్స్ ఎన్ని కుట్రలు చేసినా తాను మాత్రం తాడిపత్రి వెళ్లి తీరుతాను అన్నారు.