TS Budget Tensions :  కేంద్ర బడ్జెట్ వచ్చింది. తెలంగాణకు ఎంత వస్తుందో తేలిపోయింది. నికరంగా పన్నుల్లో వాటాలు తప్ప ప్రత్యేకంగా వచ్చే నిధులేమీ లేవని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ బడ్జెట్ పై పడింది. ఆరో తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఎన్నికల ఏడాదిలో తెలంగాణ సర్కార్ ఎన్నో ప్రజాకర్షక పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. అదే సమయంలో అభివృద్ధి కూడా ఆగకూడదు. మరో వైపు అప్పులు.. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఏం చేస్తారనేది కీలకంగా మారింది. 


ప్రస్తుత బడ్జెట్‌లో పథకాలకు కేటాయించిన నిధులు విడుదల చేయలేదు ! 


తెలంగాణ  ప్రస్తుత ఆర్ధిక ఏడాది రూ. 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో వాస్తవికంగా చేసిన ఖర్చులు, సమకూరిన రాబడులతో సవరించిన బడ్జెట్‌ కు ఎక్కువ తేడా కనిపించే అవకాశం ఉంది.  ప్రస్తుత బడ్జెట్‌లో ప్రధానంగా నిరుద్యోగ భృతికి రూ. 3వేల కోట్లు కేటాయించినప్పటికీ ఈ పథకం మొదలు పెట్టలేదు. దళితబంధు పథకానికి బడ్జెట్‌లో రూ. 17,700కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ పథకం అమలులో నెలకొన్న సందిగ్ధత కారణంగా లక్ష్యం చేరలేదు. ఒక్కో శాసనసభా నియోజకవర్గంలో 1500 మంది చొప్పున రూ. 10లక్షలు ఆర్ధిక సాయం చేసి దళితుల అభ్యున్నతే లక్ష్యంగా అమలులోకి తెచ్చిన ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఆచరణలో సఫలం కాలేదు. దీంతో నిధుల విడుదల నిల్చిపోయింది. సొంత స్థలం ఉన్న వారికి ఇండ్లు కట్టుకునేందుకు రూ. 3లక్షల ఆర్ధిక సాయం పథకంపై ఎటువంటి కసరత్తు లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. ఈ ఏడాది 4లక్షల మందికి సాయం అందించాలన్న లక్ష్యం మార్గదర్శకాలు రాకపోవడంతో ఒక్క అడుగూ మందుకు పడలేదు. 


పలు అభివృద్ధి పనుల నిధులూ మంజూరు చేయలేకపోయారు ! 


ఇక పాతబస్తీ మెట్రో కనెక్టివిటీకి రూ. 500కోట్లు బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించినప్పటికీ ఈ పనులు ఇంకా మొదలు కాలేదు. అసలు అలైన్‌మెంట్‌ కార్యాచరణ కూడా మొదలవకపోవడంతో నిధుల విడుదల నిల్చిపోయింది. ప్రస్తుత ఏడాదిలో రూ. 75వేల వరకు రైతు రుణమాఫికీ నిధులు కేటాయించినప్పటికీ 7లక్షల మందికి రూ. 4వేల కోట్ల నిధులు నిల్చిపోయాయి.  యాదవ, కుర్మలకు ఉచిత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టిన సర్కార్‌ రూ. 1000 కోట్లను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు చేసినా ఒక్క పైసా విడుదల కాలేదు. విద్యార్ధుల ఉపకార వేతనాలకు తెలంగాణ సర్కార్‌ మొదటినుంచీ అత్యంత ప్రాధాన్యతనిచ్చినప్పటికీ ఇందుకు కేటాయించిన రూ. 4688కోట్లు బడ్జెట్‌ రిలీజ్‌ చేయలేకపోయింది. లక్షమంది భవన నిర్మాణ కార్మికులకు ఉచిత మోపెడ్‌ల మాట మర్చిపోయారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేసినప్పటికీ ఈ పథకం అమలులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో పెండింగ్‌లో పడిపోయింది.ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రూ. 1500కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం నిధుల విడుదలలో కొంత నిరాసక్తత ప్రదర్శించింది. ఎస్టీల సంక్షేమానికి రూ. 12,565కోట్లలో 80శాతం లక్ష్యం చేరినట్లు తెలిసింది. గిరిజన ఆవాస ప్రాంతాలకు రహదారుల వసతి విస్తరణకు కేటాయించిన రూ. 1000 కోట్లు విడుదల కాలేదని అంటున్నారు. 


సంక్షేమ రంగంలో భారీగా ఖర్చు !


పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ. 2142కోట్లు, విద్యుత్‌ రాయితీకి రూ. 190కోట్లు ఖర్చు చేయలేదు. విద్యుత్‌ రాయితీ రూ. 10,700కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో డిస్కంలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ప్రచారం జరుగుతోంది. సంక్షేమరంగానికి రూ. 31వేల కోట్లకు మించి ఖర్చు చేసిన తెలంగాణ సంక్షేమ సర్కార్‌, ప్రస్తుత ఏడాదిలో రైతు, సంక్షేమ, వైద్య రంగాలను ప్రాధాన్యతా క్రమంలో భారీగా నిధులను విడుదల చేసింది.   కేంద్రంనుంచి అందాల్సిన గ్రాంట్లు, నిధులు, సాయాల్లో రూ. 56వేల కోట్లు కోతలు పడటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. మొత్తం రాబడులలో తెలంగాణ 19శాతం వృద్ధిరేట్లను నమోదు చేసుకున్నది. తీవ్రమైన ఆర్ధిక సవాళ్లు ఉన్నప్పటికీ పథకాలను సకాలంలో అమలు చేసే ప్రయత్నాలు 80శాతం లక్ష్యం చేరాయి.


ఈ ఏడాది బడ్జెట్ లో ఏం చేయబోతున్నారు ?


ప్రస్తుత బడ్జెట్ లో ఖర్చు చేయని పథకాలను వచ్చే ఏడాది కొనసాగిస్తారని అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక కొత్త పథకాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికల ఏడాదిలో వాటిని అమలు చేసి ఆయన ఓట్లు అడగాలనుకుంటున్నారు. అందుకే ఈ సారి పద్దులు హరీష్ రావు లెక్కల మాయాజాలానికి సాక్ష్యంగా నిలువనున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.