Chhattisgarh Ex CM Ajit Jogis son Amit Jogi calls on KCR in Hyderabad:
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో మద్దతు పెరుగుతోంది. ఇటీవల ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, అమిత్ జోగీ తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన అమిత్ జోగీ బుధవారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చలు జరిగాపారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాల పై లోతుగా చర్చించారు.
బిఆర్ఎస్ జాతీయ పార్టీ విధి విధానాలను ఆసక్తితో అధినేత సిఎం కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు అమిత్ జోగీ. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఉన్నదని అభిప్రాయ పడిన అమిత్ జోగి., బిఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించడాన్ని ఆహ్వానించారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్ర పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని, సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరసలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేసారని సిఎం కేసీఆర్ ను అభినందించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ కు అమిత్ జోగీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తన గురించి రాసుకున్న ఆటోబయోగ్రఫీని సిఎం కేసీఆర్ కి బహూకరించారు. కాగా, జనతా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.
గత వారం బీఆర్ఎస్ లో ఒడిశా మాజీ సీఎం చేరిక
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో గిరిధర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గిరిధర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జయరాం పాంగీ, రామచంద్ర హన్ష్‌డా, బృందావన్ మజ్హీ, నబీన్ నంద, రాథా దాస్, భగీరథి సేతి, మయదార్ జేనా ఉన్నారు. గిరిధర్ గమాంగ్‌ను బీఆర్ఎస్ ఒడిషా శాఖ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.
దేశంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మహాన్ భారత్ నిర్మిద్దాం అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం అని ఆయన స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని తేల్చిచెప్పారు. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో 13 నెలల ఉద్యమం ఎందుకు చేశారు. ఇప్పటికీ రైతులకు ఒక భరోసా ఇవ్వలేకపోయింది కేంద్రం. అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని ఎత్తుకున్నది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించండి.. దేశంలో నీళ్లు, కరెంట్ ఎందుకు రావో నేను చూస్తాను. మనసు పెట్టి పని చేస్తే ఏదైనా సాధ్యమే. తెలంగాణకు అందుకు సాక్ష్యమని... తెలంగాణలో సాధ్యమైంది.. దేశమంతటా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.