AP YsRCP Politics :    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచార భేరి మోగించింది. తాము గొప్ప పనులు చేశామని ఆ పనులన్నింటికీ ప్రతీ గడపకు తీసుకెళ్లి చెప్పాలనుకుంటోంది. ఇందు కోసం రకరకాల పేర్లతో ఇంటింటికి వెళ్లాలని అనుకుంటోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు నెలల తరబడి గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొత్తగా మా నమ్మకం నువ్వే జగన్,  జగనన్నే మా భవిష్యత్ అనే రెండు ప్రచార కార్యక్రమాలనూ ప్రారంభించాలని నిర్ణయించారు. వాలంటీర్లు, గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు ఇలా రకరకాల పేర్లతో క్యాడర్ ను రెడీ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇంకా  పధ్నాలుగు నెలలకు సమయం ఉండగానే.. ప్రభుత్వం ఎందుకంత కంగారు పడుతోంది ? పథకాల కన్నా ప్రచారమే ఎక్కువ అవుతోందన్న విమర్శలు రావడానికి ఈ దూకుడే కారణమా  ?


గడప గడపకూ వెళ్లేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ !


ప్రతి ఇంటికి వెళ్లాలని వైఎస్ఆర్‌సీపీ అనుకుంటోంది. వాలంటీర్ల ద్వారా ఇప్పటికే చాలా సార్లు అన్ని ఇళ్లను కవర్ చేసినప్పటికీ ఈసారి పథకాలు పొందిన వారు .. ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీకే ఓటు వేసేలా చేయాలని అనుకుంటున్నారు. అందు కోసం ఇప్పటి వరకూ గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఎవరెవరికి ఎంత లబ్దిచేకూర్చామో.. పత్రాల్లో లెక్కలు వేసి ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్న సంగతిని పక్కన పెడితే.. మరో రెండు సార్లు వారం వ్యవధిలో అన్ని ఇళ్లకూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 


స్టిక్కర్ల ప్రచార భేరీ !


మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ పేరుతో ప్రచార కార్యక్రమాలను సిద్దం చేశారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు ఈ ప్రచారం చేస్తున్నామని చెబుతున్నారు. 20 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ప్రచారం చేపట్టనున్నట్లు వైఎస్‌ఆర్‌సిపి నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, వాటి అమలును ఈ కార్యక్రమంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పరిశీలకులతో ముఖ్యమంత్రి జగన్ ఇదే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు.  వాలంటీర్లతో కలిసి గృహ సారథులు ఇళ్లను సందర్శిస్తారు. సచివాలయం కన్వీనర్లతో పాటు గ్రామ, వార్డు వాలంటీర్లు అందరూ ఈ ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. పార్టీకి.. ప్రభుత్వానికి మధ్య తేడా లేకుండా చేయడంతో ఇప్పుడు ఉద్యోగులు కూడా పార్టీ పనులు చేయాల్సి వస్తోంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఏ మాత్రం క్లిక్ కాలేదని రిపోర్టులు రావడం అనేక సమస్యలు బయటకు రావడంతో ప్రత్యామ్నాయం.. ఇప్పుడు కేవలం పథకాల గురించి ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. ప్రతి ఇంటి ముందు స్టిక్కర్ అంటించడంతో పాటు లబ్దిదారుల సెల్ ఫోన్లకు కూడా స్టిక్కర్లు అంటించాలని నిర్ణయించారు. 


అంతా ఐ ప్యాక్ వ్యూహాలేనా ?


వైసీపీ కోసం...  ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ సంస్థనే నేరుగా ప్రజలకు చేరువ అయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తోందని చెబుతున్నారు. ఇలా ఒకటికి రెండు సార్లు ప్రతి ఇంటిలోని వాళ్లను పలకరించడం వల్ల ప్రభుత్వం మన దగ్గరగా ఉందన్న అభిప్రాయం ఏర్పడుతుందని.. దాని వల్ల అనుకోకుండానే ఓటు వేసేటప్పుడు తమ వైపు మొగ్గుతారని వారి అంచనా అంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ కు కూడా ఈ స్ట్రాటజీలపై గురి ఉండటంతో ఎలాంటి లోపం లేకుండా అమలు చేయాలని.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.