Early Polls  :   కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమయింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సమావేశాలు ముగిసిన తర్వాత  సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే దేశంలో  ముందస్తు ఎన్నికలకు కేంద్రం ప్లాన్ చేసిందని చెబుతున్నారు. డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయని I.N.D.I.A కూటమి నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ కూడా అందుకోసమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


జమిలీ ఎన్నికల కోసం బిల్లు తీసుకు వస్తారా ? 


జమిలీ ఎన్నికలు అనేది  బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఓ టార్గెట్ . వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే పద్దతికి ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతుంది. జమిలీ కోసం లా కమిషన్ సిఫారసులు కూడా చేసింది. జమిలీ ఎన్నికలు అంటూ వస్తే నిర్వహించాడనికి తాము సిద్ధమేనని ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు కేంద్రం జమిలీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో కాకపోయినా సగం రాష్ట్రాలకు పార్లమెంట్ తో పాటే ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందు కోసం చట్టసవరణ చేయడానికే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశ పరుస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


పూర్తి స్థాయి జమిలీ సాధ్యం కాదు - పాక్షిక జమిలీకి రెడీ ! 


వ‌చ్చే ఏడాది మార్చిలో లోక్‌స‌భ ఎన్నిక‌లు జరగాల్సి ఉంది.  షెడ్యుల్ ప్రకారం డిసెంబ‌ర్‌లోపు తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌ఢ్, రాజస్ధాన్, మ‌ధ్యప్రదేశ్, మిజోరం ఎన్నిక‌లు జరగాల్సి ఉంది. ఆ త‌ర్వాత ఆరు నెలల్లోనే లోక్ స‌భ ఎన్నిక‌లతో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నిక‌లు జరగాలి. ఇంకా జమ్మూకశ్మీర్ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెబుతోంది. అంటే పది రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు ఎందుకు  అన్నింటినీ ఒకే సారి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు తేడాగా ఉన్నాయి. ఆ రాష్ట్రం ఎన్నికలు కూడా ఒకే సారి పెట్టేస్తే పనైపోతుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. 


పది రాష్ట్రాలు.. లోక్ సభకు ఒకే సారి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారా ? 
 
లోక్‌సభతో పాటు మొత్తం 10 రాష్ట్రాల ఎన్నికలను మినీ జమిలీ తరహాలో జరపాలన్న ఆలోచనలో ఉందని చెబుతున్నారు.  అన్నీ అనుకున్నట్లు జరిగితే మ‌హారాష్ట అసెంబ్లీని రద్దు చేసే యోచ‌న‌లో బీజేపీ ఉందని ముంబై వర్గాల్లో చర్చ నడుస్తోంది.  అయితే ఇలా కేంద్రం అనుకుంటే అలా ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.  ఇందుకు అనుగుణంగా ల పార్లమెంటు స‌మావేశాల్లో కేంద్రం.. బిల్లు ప్రవేశపెట్టబోతోందని ఢిల్లీలో విస్తృత ప్రచారం జరుగుతోంది.  ఈ బిల్లు పాస్ అయితే ‘మిని జమిలి ఎన్నికలు’  జరిగే అవకాశం ఉంది.  వృధా ఖ‌ర్చును అరిక‌ట్టే ఉద్దేశంతో జ‌మిలి ఎన్నిక‌లు జరపబోతున్నామని ఆర్టికల్ 172  ప్రకారం అసెంబ్లీ గడువును పెంచే అధికారం తమకు ఉందని కేంద్రం వాదించే అవకాశం ఉంది.  
    
ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామంటున్న ఈసీ 


తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది.  అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.  రాజ్యాంగం ప్రకారం అయితే అసెంబ్లీల గడువు ముగియడానికి ఆరు నెలల ముందే ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ లేటుగా నిర్వహించడానికి అవకాశం లేదు. ఐదేళ్ల గడువు పూర్తయితే ఆ ప్రభుత్వానికి కాలం తీరిపోయినట్లే. అయితే రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది. అసెంబ్లీ గడువు పొడిగింపు సాధ్యమా కాదా అన్నది రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సి ఉంది. మినీ జమిలీపై స్పష్టత పార్లమెంట్ సమావేశాల్లోనే వచ్చే అవకాశం ఉంది.