Congress ponnala :  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన పొన్నాల లక్ష్మయ్య రాజకీయ  భవిష్యత్ గందరగోళంగా మారింది. గత ఎన్నికల్లోనే ఆయన బీసీ నినాదం, మాజీ పీసీసీ చీఫ్ ని అని చెప్పి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తేనే టిక్కెట్ లభించింది. ఈ సారి ఆయనకు టిక్కెట్ ఇవ్వరని ప్రచారం జరుగుతూండటంతో.. ఆయన మరోసారి బీసీ వాదంతో  ఒత్తిడి తెచ్చే  ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఆర్. కృష్ణయ్య లాంటి వారిని ఇంటికి పిలిచి హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. 


వైఎస్ హయాంలో వరంగల్ జిల్లాలో చక్రం తిప్పిన పొన్నాల


వైఎస్ హయాంలో కీలక మంత్రిగా  , తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చక్రం తిప్పారు. కానీ ఇప్పుడు ఆయనకు  కాంగ్రెస్ లో  కనీస పలుకుబడి లేకుండా పోయింది.   సొంత నియోజకవర్గం  జనగామలో కనీస ఆదరణ లేకుండా పోయింది. జనగామలో తన ప్రాతినిధ్యం, ఉనికి కోసం తాపత్రయపడుతున్నారు.  పొన్నాల లక్ష్మయ్య తన రాజకీయ రంగ ప్రవేశం సొంతూరు ఖిలాషాపూరు ఉన్న జనగామ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం ఆ గ్రామం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోకి వెళ్ళింది. అది రిజర్వుడు నియోజకవర్గం కావడంతో జనగామ నుంచే రాజకీయాలు చేస్తున్నారు. 
 
జనగామలో హ్యాట్రిక్ తర్వాత పరాజయాలు


1985లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి, సీపీఎం అభ్యర్థి ఏసిరెడ్డి నర్సింహారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1989 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి చారగొండ రాజిరెడ్డిని ఓడించి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పొన్నాల తిరిగి 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. నేదుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ హయాంలో భారీనీటి పారుదల శాఖ మంత్రిగా వెలుగొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎదురులేని నాయకునిగా చక్రం తిప్పారు.  తెలంగాణ రాష్ట్ర‌ ఏర్పాటు తర్వాత బీసీ నేతగా కాంగ్రెస్ అధిష్టానం తొలి పీసీసీ చీఫ్ గా పొన్నాలను నియమించింది. అందివచ్చిన అవకాశాన్ని కాపాడుకుని, నాయకత్వ పటిమను ప్రదర్శించడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. పొన్నాల ఆధ్వర్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమిచెందడమే కాకుండా, తాను ప్రాతినిధ్యం వహించిన జనగామలో పరాజయం పాలయ్యారు. 


క్రమంగా  మసకబారిన ప్రాభవం - ఇప్పుడు టిక్కెట్ కోసం బీసీ నినాదం 


పొన్నాల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి  దిగజారిపోవండతో   కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలను పీసీసీ చీఫ్ నుంచి తప్పించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పొన్నాల ప్రభ మసకబారుతూ వచ్చింది.   2018 ఎన్నికల్లో పొన్నాలకు జనగామ టికెట్ చివరి నిమిషంలో కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు పోటీచేసే అవకాశం వస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో ఈ సీటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. ఆఖరి సమయంలో టికెట్ ఇవ్వడంతో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.


ఇప్పుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టిక్కెట్ కేటాయిస్తారనిప్రచారం  
 
పొన్నాల వరుసగా రెండు సార్లు ఓటమి చెందడంతో పాటు వివిధ కారణాల వల్ల జనగామకు దూరమయ్యారు. ఎప్పుడో ఓ సారి కనిపించేవారు. దీంతో బీఆర్ఎస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి తన పలుకుబడి పెంచుకుంటూ వచ్చారు.  ఇటీవల కొమ్మూరిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో పొన్నాల జీర్ణించుకోలేక పోయారు. తన టిక్కెట్ కు కూడా ఎసరు పెడతారేమోనని  ఆయన కంగారు పడుతున్నారు.   కీలకమైన ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో సైతం పొన్నాలకు స్థానం దక్కలేదు. అందుకే  బీసీలకు  బీసీలకు తగినన్ని స్థానాలు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆర్. కృష్ణయ్య వంటి వారి మద్దతుతో ప్రయత్నిస్తున్నారు.