What is BRS chief KCR going to achieve with BJP :  తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్  బీఆర్ఎస్ భవిష్యత్ . ఆ పార్టీ బీజేపీతో టై అప్ కోసం చర్చలు జరుపుతోంది.  కుదిరితే పొత్తు లేకపోతే విలీనం అన్నట్లుగా ఢిల్లీలో ఒక రౌండ్ చర్చలు ముగిశాయని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ను.. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రశ్నంచారు. స్పందించాలని డిమాండ్ చేశారు. కానీ  బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. ఈ కారణంగా ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ , బీజేపీ విలీనం లేదా పొత్తులు ఖాయమని నమ్ముతున్నారు. ఈ పరిణామం వల్ల బీజేపీ ఎంత లాభ పడుతుందన్న సంగతి పక్కన పెడితే.. అస్థిత్వానికే ముప్పు వచ్చే ప్రమాదమున్నా ఎందుకు బీఆర్ఎస్ తొందరపడుతోంది ? . ఎలాంటి ప్రయోజనాలను ఆశిస్తోంది ? అన్నది పెద్ద పజిల్ గా మారింది. 


ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసమని ప్రచారం !


ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయి నాలుగు నెలలు దాటింది. ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆమెను  బయటకు తీసుకు రావడానికి కేసీఆర్ రాజకీయ వ్యూహల పరంగా ప్రయత్నిస్తున్నారని అందుకే బీజేపీతో సంబంధాల దిశగా చర్చలు జరుగుతున్నాయని ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు. అయితే ఒక్క  బెయిల్ కోసం పార్టీని త్యాగం చేస్తారని ఊహించలేరు. కవితను ఇంకా ఎంతో కాలం జైల్లో పెట్టలేరని..న్యాయవర్గాలు అంచనా  వేస్తున్నాయి. ఇటీవల కేజ్రీవాల్ కు కూడా సుప్రీంకోర్టు ఈడీ కేసులో  బెయిల్ మంజూరు చేసింది. అలాగే కవితకూ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసులో చార్జిషీట్ల పేరుతో ఇంత కాలం జైల్లో పెట్టలేరని ... అటూ ఇటూగా జైలు నుంచి వచ్చేస్తారని అనుకుంటున్నారు. మరి ఇలాంటి సమయంలో పార్టీని .. కేవలం కవిత కోసమే బీజేపీ తో పొత్తుల కోసం వెళ్తారని అనుకోవడం లేదు. 


బీఆర్ఎస్‌తో పొత్తు, విలీనంపై బీజేపీలో విభజన - ముగ్గురు ఎంపీల తీవ్ర వ్యతిరేకత ?


కేసీఆర్‌ది అంతకు మించిన వ్యూహం ! 


కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఆ మధ్య కొంత మంది పార్టీ నేతల్ని కలిశారు. పార్టీ త్వరలో అధికారంలోకి వస్తుందని వారికి ధైర్యం చెప్పారు. అయితే చాలా మంది  ఈ విషయంలో క్యాడర్ కు భరోసా ఇవ్వడనికి చెప్పారని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అలాంటి ప్లాన్ లో ఉన్నారని బీజేపీతో చర్చల గురించి బయటకు వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. బీజేపీతో అయితే పొత్తులు పెట్టుకుని లేకపోతే విలీనం చేసి అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. అధికారికంగా బీఆర్ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. కానీ కేసీఆర్.. అరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఓ సీనియర్ నేత తనకు ఫోన్ చేశారని ఆయన గతంలో చెప్పారు. బీజేపీ తల్చుకుంటే ఆపరేషన్ కమల్ ప్రారంభిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని ఆకర్షించడం పెద్ద పనేమీ కాదని ఎక్కువ మంది భావన. ఈ ఆలోచనలతోనే కేసీఆర్ బీజేపీతో కలిసిపోయేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. తర్వాత ఎన్నికల వరకూ ఉంటే.. సర్వైవ్ అవుతామా లేదా అన్నది చెప్పలేరు..కానీ ఇప్పుడు అధికారంలోకి పొత్తులు పెట్టుకుని అయినా  వస్తే..చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అనుకోవచ్చు. 


రుణ మాఫీ మ్యాజిక్ చేసిన రేవంత్ - రూ. 31 వేల కోట్లు ఎలా సమీకరిస్తున్నారంటే ?


కాంగ్రెస్ విరగుడు రాజకీయంతో మొదటికే మోసం 


అయితే కాంగ్రెస్ పార్టీ త్వరగానే కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టినట్లుగా ఉంది. చేతులు కాలేదాకా ఊరుకోవడం కన్నా వెంటనే  ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మంచిదన్న ఉద్దేశంతో రంగంలోకి దిగిపోయారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలను చేర్చేసుకున్నారు. ఆ మేరకు బీఆర్ఎస్  బలం తగ్గిపోయింది. మరో పది మందికిపైగా  కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారమూ ఉంది. అంటే.. మొత్తంగా బీఆర్ఎస్ వైపు తగ్గిపోయే బలం కాంగ్రెస్ వైపు చేరుతోంది. నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే తప్ప.. ప్రభు్తవాన్ని ఇబ్బంది పెట్టలేని పరిస్థితి వచ్చింది. అంటే కేసీఆర్ అంచనాలు తలకిందులు అయినట్లే. బీజేపీతో చర్చలను చూపించి.. కొంత మంది ఎమ్మెల్యేలను ఆపగలుగుతున్నారు కానీ..  ఆ విషయంపై స్పష్టత వస్తే మరికొంత మంది ఎమ్మెల్యేలు అదే బాట పడతారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఒకప్పుడు ఆయనను అపర చాణక్యుడిగా అందరి ముందు నిలబెట్టేవి. కానీ ఇప్పుడు రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.