Telangana BJP is in silent mode :  తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేపట్టి ఎనిమిది నెలలు అవుతోంది. దీంతో ఇక హనీమూన్ పీరియడ్ ముగిసిందని పోరాటం చేయాల్సిందేనని విపక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలినప్పటికీ అంతర్గతంగా.. బహింగంగా అనే సమస్యలు ఎదుర్కుంటున్నప్పటికీ ప్రభుత్వంపై ప్రతి విషయంలోనూ విమర్శలు గుప్పించడానికి రెడీగా ఉంటోంది. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలోనూ.. ఒకే సారి చేస్తామని చెప్పి.. మొదట రైతు బంధు నిధులు మాత్రమే దారి మళ్లించి ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పై  ఎటాక్ చేయడంలో బీఆర్ఎస్ లాజికల్ గా ఉంది మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ మాత్రం ఈ విషయంలో పెద్దగా ప్రజల దృష్టిలో పడలేకపోతోంది. 


కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ సైలెంట్ 


పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రదాన ప్రతిపక్షమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీకి 35 శాతం ఓటు బ్యాంక్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి పదహారు శాతమే వచ్చింది. అందుకే తామే ప్రధాన ప్రతిపక్షమని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వపై పోరాటంలో దూకుడు మాత్రం చూపించలేకపోతున్నారు. పరీక్షల వాయిదా కోసం విద్యార్థి నేతలు ఉద్యమ బాట పట్టారు. ఈ విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ఉంది. తాము నేరుగా రంగంలోకి దిగితే రాజకీయం అవుతుందని విద్యార్థులకు పూర్తి స్థాయిలో మద్దతునిచ్చింది. కానీ బీజేపీ వైపు నుంచి వారికి ఎలాంటి సపోర్టు లభించలేదు. ఇక రుణమాఫీ తో పాటు ఇతర హామీల విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజూ బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది కానీ బీజేపీ మొక్కుబడి ప్రెస్ మీట్లకే పరిమితమవతోంది. సోషల్ మీడియాలోనూ బీజేపీ కార్యకర్తలు అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. మొత్తం షో బీఆర్ఎస్ నడిపిస్తోంది.  దీంతో బీఆర్ఎస్ అందరి నోళ్లలో నానుతోంది. 


రుణ మాఫీ మ్యాజిక్ చేసిన రేవంత్ - రూ. 31 వేల కోట్లు ఎలా సమీకరిస్తున్నారంటే ?


బీజేపీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకపోవడమే కారణమా ?


భారతీయ జనతా  పార్టీ తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయన కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా వారాంతాల్లోనూ తెలంగాణకు రావడం కష్టమే. విధి నిర్వహణలో  బిజీగా ఉంటారు.  ఈ కారణంగా తెలంగాణ బీజేపీలో ఎవరు యాక్టివ్ పార్ట్ తీసుకోవాలో అర్థం కాక సైలెంట్ అయిపోయారు. అంతకు మందు తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి అయ్యారు. అయన కుదిరినప్పుడల్లా వచ్చి కార్యక్రమాలు పెడుతున్నారు కానీ అన్నీ పార్ట్ టైమ్ వ్యవహారాలుగా  మిగిలిపోతున్నాయి. ఈ కారణంగా బీజేపీ పెద్దగా ఫీల్డ్ లో లేదన్న అభిప్రాయం బలపడుతోంది. 


బీఆర్ఎస్‌తో పొత్తు, విలీనంపై బీజేపీలో విభజన - ముగ్గురు ఎంపీల తీవ్ర వ్యతిరేకత ?


వర్గపోరాటం వల్ల అధ్యక్షుడి నియామకం ఆలస్యం ! 


కేంద్ర మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారన్న క్లారిటీ వచ్చేసింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరికీ కేంద్రమంత్రి పదవులు ఇచ్చినందున మరో సీనియర్ నేతకు అవకాశం కల్పించడం ఖాయమని తేలిపోయింది. ఆ రేసులో ఈటల రాజేందర్ ముందు వరుసులో ఉన్నారని లీకులు కూడా వచ్చాయి. కానీ ఆయనను చీఫ్ పదవలో కూర్చోబెట్టడంపై ఏకాభిప్రాయం రాలేదు. ఈ కారణంగానే ప్రకటన ఆలస్యమవుతున్నట్లుగా చెబుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే ఈటలను వ్యతిరేకిస్తున్నారు. కొంత మంది నేతలు సైలెంట్ గా.. వేరే పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవద్దని ఫిర్యాదులు చేశారు. అందుకే ఇటీవల కేంద్ర పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధులో పార్టీలో ఉన్న వారిలో కొత్త పాత అంటూ ఏమీ ఉండదని స్పష్టం చేసి వెళ్లారు. అయినప్పటికీ జరుగుతున్న పరిణామాల కారణంగా ఇప్పుల్లా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడ్ని నియమించే అవకాశం లేదని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తులు, విలీన చర్చలు నడుస్తున్నందున.. ఆ ప్రక్రియపై స్పష్టత వచ్చే వరకూ అధ్యక్షుడి విషయంలో వేచి చూస్తారని చెబుతున్నారు. 


అయితే ఇప్పటికీ బీజేపీ క్యాడర్ పోరాట పంధాలోకి రాలేదు. దాదాపుగా అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. మహా అయితే ఓ ప్రెస్ మీట్ తో సరి పెడుతున్నారు. దాని వల్ల పార్టీకి మైలేజీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. పూర్తి సమయం కేటాయించే అధ్యక్షుడ్ని నియమించే వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందని బీజేపీ కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు.