3 BJP MPs oppose With BRS Ties :  భారత రాష్ట్ర సమితి పార్టీ బీజేపీలో విలీనం లేదా పొత్తు కోసం చర్చలు పూర్తయ్యాయని కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా వారం రోజుల పాటు  ఢిల్లీలో మకాం వేసి వచ్చిన తర్వాత ఈ ప్రచారం ఊపందుకుంది. అయినా బీఆర్ఎస్ వైపు నుంచి ఖండన ప్రకటనలు రావడం లేదు. ఢిల్లీలో చర్చలు జరిపారని భావిస్తున్న హరీష్ రావు, కేటీఆర్ సైలెంట్ గా ఉండటంతో ఆ చర్చలు నిజమని అందరూ నమ్ముతున్నారు. 


బీఆర్ఎస్‌తో రాజకీయ సంబంధాలపై బీజేపీ హైకమాండ్ సంప్రదింపులు             


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల్లో ఏకాభిప్రాయం కోసం హైకమాండ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తా లేకపోతే విలీనమా అన్న అంశాలపై అభిప్రాయసేకరణ జరుపుతున్నారు. ముగ్గురు ఎంపీలు బీఆర్ఎస్‌తో అసలు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని గట్టిగా పట్టుబడుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీతో విలీనం చేసుకున్నా.. పొత్తులు పెట్టుకున్నా అది బీజేపీకి నష్టం చేస్తుందని వారు వాదిస్తున్నారు. బీఆర్ఎస్ బలహీనపడుతోందని ఆ పార్టీ ఓటు బ్యాంక్ క్రమంగా బీజేపీకి దగ్గరవుతోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వారితో పొత్తులు లేదా విలీనం అనే రాజకీయ పరిణామాలు సంభవిస్తే.. అది బీజేపీకి మైనస్ అవుతుందని వారు గట్టిగా చెబుతున్నారు. 


కొంత మంది సానుకూలత                                              


మరో ఇద్దరు ఎంపీలతో పాటు కొంత మంది సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడం మంచిదనేని హైకమాండ్ కు చెబుతున్నారు. ఉద్యమ పార్టీగా ఆ పార్టీకి గ్రౌండ్ లెవల్‌లో క్యాడర్ ఉందని ఆ పార్టీ క్యాడర్ వల్ల  బీజేపీ ఆటోమేటిక్ గా బలపడుతుందని చెబుతున్నారు. మిగిలిన ముగ్గురు ఎంపీలు హైకమాండ్ పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలంతా ఏకాభిప్రాయానికి రాలేకపోతూండటంతో ఈ అంశంపై పార్టీ హైకమాండ్ ఇంకా సంప్రదింపులు జరుపాలని అనుకుంటోంది. ఈ కారణంగానే ప్రకటన ఆలస్యమవుతోందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. 


విలీనం అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆకర్ష్ ?                            


బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం ఖాయమని ఇప్పటికే చెబుతున్నారు. పరిస్థితుల్ని బట్టి పార్టీ విలీనంపై మాట్లాతారని అనుకున్నారు. బీజేపీ పార్టీలో వచ్చే వ్యతిరేకతను బట్టే కాస్త తగ్గుతున్నారని అంటున్నారు. రెండు పార్టీలు విలీనం అయితే ..త తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంగతి చూడవచ్చన్న ఆలోచనతో పార్టీ మారాలనుకుంటున్న కొంత మంది నేతల్ని  బీఆర్ఎస్ నేతలు ఆపుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ రాజకీయం.. బీజేపీలోని  పరిణామాలపై ఆధారపడి ఉంది.