How Revanth Raised 31 thousand crore rupees for loan waiver : తెలంగాణలో బ్యాంకుల వద్ద అప్పు తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగి చెప్పారు. తాము చత్తీస్ ఘడ్‌లో చేసి చూపించామన్నారు. నిజానికి ఈ రెండు లక్షల రుణమాఫీ హామీని 2018లో కూడా కాంగ్రెస్ ఇచ్చింది. కానీ అప్పుడు జనం నమ్మలేదు. ఇప్పుడు నమ్మారు. ఓట్లు వేశారు. అయినా రుణమాఫీ అసాధ్యమని బీఆర్ఎస్ వాదిస్తూ వచ్చింది. తాము లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయామని ఆర్థిక పరిస్థితి కఠినంగా ఉందని చెప్పుకొచ్చింది. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు కూడా సవాల్ చేశారు ఆ ధైర్యంతోనే. కానీ రేవంత్ రెడ్డి డెడ్ లైన్ పెట్టుకుని మరీ రుణమాఫీ చేయబోతున్నానని ప్రకటించారు. రూ. 31వేల కోట్లు ఇందుకు అవసరం అవుతాయని ప్రకటించి.. ఆ మేరకు చెప్పిన సమయానికి నెల ముందే రూ. లక్ష రుణమాఫీని పూర్తి చేశారు. ఇందు కోసం రూ. ఆరు వేల కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. నెలాఖరుకు లక్షన్నర, ఆ తర్వాత రెండు లక్షల వరకూ రుణాలను మాఫీ చేస్తారు. మొత్తం 40లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నగదను జమ చేయనున్నారు. తొలివిడతగా ఇచ్చే లక్ష రూపాయల రుణ పరిధిలో 11.5 లక్షల మంది రైతులున్నారు. ఇందుకోసం 6వేల కోట్లకు పైగా మొత్తాన్ని ఇప్పటికే రైతుల ఖాతాలకు పంపారు. ఇక మిగిలిన ఇరవై నాలుగు కోట్లు సమీకరిస్తామన్న దైర్యం రేవంత్ లో కనిపిస్తోంది. ఇంత నగదు ఎలా సమీకరించారు అన్నదే అసలు ఆర్థిక వేత్తలకు కూడా సస్పెన్స్ గా మారింది. కానీ నిధులెక్కడ నుంచి వస్తే ఏంటి తాము రుణమాఫీ అమలు చేశామా లేదా అన్నదే ముఖ్యమన్నట్లు గా కాంగ్రెస్ ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది.
ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన పథకాలు - నిధుల మిగులు ?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఖాళీ ఖజానా ఎదురొచ్చింది. రైతు బంధు పథకానికి బటన్ నొక్కుతామని హడావుడి చేశారు కానీ రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆ సొమ్ము కూడా లేదు. చివరికి అతి కష్టం మీద రైతు బంధు అమలు చేశారు. ఈ లోపు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. దాంతో అన్ని పథకాలకు బ్రేక్ పడింది.దాదాపుగా మూడు నెలల పాటు పథకాలకు.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆపేశారు. కేవలం జీతభత్యాలు, పాత అప్పులకు కిస్తీలు మాత్రమే చెల్లిస్తూ వచ్చారు. ఈ కారణంగా ఖజానాలో మిగులు కనిపిస్తూ వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు పెరగడం.. ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఆదాయం కూడా పెరిగింది. ఈ నిధులతో రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అంటే గురువారం చేసిన రుణమాఫీ కోసం.. ప్రభుత్వం అప్పులేమీ చేయలేదు !
తెలంగాణలో రుణమాఫీ నిధులు విడుదల - ఫేస్ 1లో రూ.6 వేలకోట్లకు పైగా జమ
ఇంకా రూ. 24 వేల కోట్లు అవసరం - ఆర్బీఐ నుంచి అప్పు ద్వారా కొంత !
గురువారం పూర్తి చేసిన రుణమాఫీతో కాకుండా ఇంకా రూ. 24వేల కోట్లు అవసరం. నెలాఖరులో లక్షన్నర... ఆగస్టు పదిహేనులోపు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెబుతున్నారు. అంటే.. మరో నెల రోజుల్లోనే రూ. 24 వేల కోట్లను సమీకరించాల్సి ఉంటుంది. దీనికి తగ్గ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. ఆర్‌బీఐ నుంచి ప్రతి మంగళవారం తీసుకునే వెసులుబాటు ఉన్న రుణాలతో పాటు.. భూములను తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందు కోసం అంతర్గతంగా ప్రక్రియ జరిగిపోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఫోకస్ అంతా ఈ పథకం పైనే...
రైతు రుణమాఫీపై ఎక్కువుగా ఫోకస్ చేసిన ప్రభుత్వం మిగిలిన పథకాల నిధులను కూడా దీనికి మళ్లించేందుకు సిద్ధమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ నాటికి మొత్తం రుణమాఫీ చేసి తీరాం అనిపించుకోవడానికి ఉన్న అవకాశాలూ పరిశీలిస్తున్నారు. ఈ నెలలోనే రైతు భరోసా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేయాల్సి ఉంటుంది దానికి దాదాపు 7వేల కోట్లు అవసరం అవుతాయి. రైతుల పంట బీమాకు మరో 5వేల కోట్లు అవసరం. ప్రస్తుతానికి రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో వేయలేదు. ప్రభుత్వం రుణమాఫీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఇప్పుడు ఉన్న డబ్బులు వాటికే మళ్లించాలనుకుంటున్నారు. ఇది అమలు కష్టం అని.. అమలు చేస్తే తాము రాజీనామా చేస్తామని ప్రత్యర్థి పార్టీ నేతలు సవాళ్లు చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. కాంగ్రెస్ చెప్పిన లెక్కల ప్రకారం చూసినా కేసీఆర్ రెండు విడతల్లో కలిపి 21వేల కోట్ల రుణమాఫీ చేశారు. రెండో టర్మ్ లో 9ేవేల కోట్లు ఇచ్చారు అంటే ఆ మేరకు ఆర్థిక పరిస్థితి అనుకూలించినట్లే అనుకోవాలి. ఇప్పుడు మిగతా ఖర్చులు తగ్గించుకుని రాబడి మార్గాలు వెతికితే దీనిని చేయడం కష్టం కాదు అన్న ఆలోచన కాంగ్రెస్ కు ఉంది. అయితే కేసీఆర్ ఒకేసారి రుణమాఫీ చేయలేదు. తన ఆర్థిక వెసులుబాటును బట్టి నిదానంగా చేశారు. కానీ రేవంత్ ఈ విషయంలో దూకుడుగా వెళ్లారు. ఒక నెలరోజుల్లోనే మొత్తం పూర్తి చేయాలని చూశారు. ప్రస్తుతానికి వచ్చే రాబడిని.. మిగతా పథకాలకు ఇవ్వాల్సిన నిధులను, మూలధన వ్యయాన్ని, అన్నింటినీ ఇటే మళ్లించనున్నారు. ఇవి కాకుండా బ్యాంకులలో అధిక వడ్డీలకు ఉన్న రుణాలను తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకులకు మళ్లించడం ద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేయొచ్చని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
400 ఎకరాల తాకట్టుకు సన్నాహాలు ?
తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అత్యంత విలువైన ఆదాయ వనరు భూములు. ఐటీ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఖరీదైన భూములు ఉన్నాయి. వాటిలో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో 20వేల కోట్లు ఉంటుందని అంచనా. వీటిని తాకట్టు పెట్టేందుకు ఓ మర్చంట్ బ్యాంక్ కోసం టెండర్ ప్రకటన కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎకరానికి గరిష్టంగా 50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను 20వేల కోట్లుగా నిర్ణయించారు. కనీసం పదివేల కోట్లు అయిన రుణం అందుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా భూములు తాకట్టు పెట్టడంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసినా.. ప్రభుత్వం స్పందించలేదు. తాము భూములు తాకట్టు పెట్టడం లేదని చెప్పలేదు.
ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు - అనారోగ్యం కారణంగా కోర్టు నిర్ణయం
ప్రత్యేక సంస్థ లేదు. సోషల్ స్టాక్ ఎక్సేంజ్ కూడా పోయిందా..?
ఇంత భారీ మొత్తంలో నిధులు ఎలా సేకరిస్తున్నారన్నదానిపై అనేక ప్రయత్నాలు చేశారు. ముందుగా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి రుణాలన్నింటినీ ఆ సంస్థకు బదిలీ చేసి దానికి ప్రభుత్వం గ్యారెంటీ ఉండేలా చేద్దాం అనుకున్నారు. దీనికి బ్యాంకర్లు ఒప్పుకోలేదు. ఎలాంటి ఆదాయం లేని సంస్థకు ప్రభుత్వం ఎలా గ్యారెంటీ ఇస్తుందని ఆర్బీఐ అభ్యంతరం చెప్పింది. ఆ తర్వాత తమ ముందున్న మార్గాలపై మంత్రి శ్రీధర్ బాబు ఓ ప్రకటన చేశారు. అదేమిటంటే సంక్షేమ పథకాలకు మూలధన సేకరణలో సెబీ రూపొందించిన సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజి విధానాన్ని వినియోగించుకుంటామని ప్రకటించారు. దీనిపై NSE ప్రతినిధులతో ఓ సమావశం కూడా నిర్వహించారు. ఇప్పుడు ఆ ప్రయత్నం ఉందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. .
వ్యాపార సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్‌కి వెళ్లొచ్చు. 2019-20 సంవత్సరపు బడ్జెట్‌లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన వచ్చంది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చేందుకు సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదుచేసుకుంది. ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. తాము కూడా రైతులకు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి.. లాభాపేక్ష లేకుండా తమ వద్ద పెట్టుబడులు పెట్టాలని ఈ విధానం ద్వారా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు. దీని ద్వారా పదిహేను వేల కోట్ల వరకూ సమీకరించాలని అనుకుంటోంది. కానీ దీనికి అనుమతి వచ్చిందా అన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఓ ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆర్బీఐ ఒప్పుకోనందున... ఇప్పుడు ఏ సంస్థ ద్వారా ఎక్సేెంజ్ కు వెళతారన్న క్లారిటీ లేదు. ప్రభుత్వం ఈ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గినట్లు అనిపిస్తోంది.
ఇలా విభిన్న మార్గాలను అంచనా వేసుకుని ఖచ్చితంగా నిధులు సమకూరుతాయనే లెక్కలతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు వెళ్తున్నారు. దీనిని అమలు చేసి పార్టీ అగ్రనేతలు రాహుల్, సోనియాలతో భారీ సభ పెట్టాలనే రాజకీయ లక్ష్యంతోనూ ముందుకు వెళుతున్నారు.