MLA Raghurama Krishna Raju : వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిన సిఐడి అధికారులను సస్పెండ్ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురామకృష్ణంరాజు అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను చంపేందుకు కుట్రపన్నారని వ్యాఖ్యానించిన రఘురామ కృష్ణంరాజు.. మీడియా వల్లే తాను బతికిపోయినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై తాను గుంటూరు జిల్లా పరిధిలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురాం కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు.


తాను ఇచ్చిన ఫిర్యాధు మేరకు మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్, విజయ పాల్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిజిహెచ్ సూపరిండెంట్ ప్రభావతి మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, పురోగతిని తెలుసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని పోలీసులు అందించేందుకు వచ్చానని, ఈ మేరకు పోలీసులకు ఆధారాలను అందించినట్లు రఘురామకృష్ణమరాజు తెలియజేశారు.


సిఐడి అధికారులపై కేసు నమోదు అయింది కాబట్టి వారిని సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. తనని అరెస్టు చేసినప్పుడు అధికారులు బయటకు వెళ్ళగానే ఐదుగురు వచ్చి తనను కొట్టారని, తనను చిత్రహింసలకు గురిచేసి ఏమీ తెలియనట్టు నటించారని వెల్లడించారు. అప్పటి జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యలు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు రఘురామ వివరించారు. తన ఫిర్యాదుపై ఎటువంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలియజేసినట్టు పేర్కొన్నారు. 307 కేసులో డీజీ స్థాయి అధికారులు, మాజీ సీఎం జగన్ ఉండడం వల్లే ఇప్పటి వరకు విచారణ జరగలేదన్నారు.


హత్యాయత్నం కేసు నమోదు అయినప్పుడు అధికారులను సస్పెండ్ చేయాలని, ఈ కేసులో ఇప్పటి వరకు వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు ఉండి ఎమ్మెల్యే. కొద్దిరోజుల తర్వాత అయినా సస్పెండ్ చేస్తారని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. పివి సునీల్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పోల్చితే తానే తానే దళిత బంధువును అని వెల్లడించారు. దళితులపై దాడి జరిగినప్పుడు తానే స్పందించినట్లు స్పష్టం చేశారు. వాళ్ళు ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవన్నారు.


కేసు నమోదైన వారందరినీ అరెస్టు చేస్తారని నమ్ముతున్నట్లు వివరించారు ఆర్‌ఆర్‌ఆర్‌. డిజి స్థాయి అధికారులు కాబట్టే అరెస్టులో జాప్యం అవుతుందని తాను భావిస్తున్నట్లు వివరించారు. ఈ కేసులో అప్పటి గుంటూరు కలెక్టర్ ని కూడా ప్రశ్నించాలన్నారు. డాక్టర్ శ్రీకాంత్ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఎందుకు రాశాడో తేలాల్సి ఉందని వివరించారు. సాక్షిగా బోరుగడ్డ అనిల్ సంతకం తీసుకున్నారని, వీరంతా అప్పటికే సిద్ధంగా ఉన్నారంటే కుట్ర ప్రకారమే జరిగిందన్నారు. తనపై రాజ ద్రోహం కేసు పెట్టారని రఘురామ ఆరోపించారు. 


సునీల్ కుమార్ బెదిరించారన్న రఘురామకృష్ణంరాజు..


అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానంటూ సునీల్ కుమార్ బెదిరించారని కూడా రఘురామకృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు పోలీసులు చేసిన గాయాలపై కోర్టుకు గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఒక ఎంపీగా తనపై జరిగిన వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ పై గతంలోనే రఘురాం కృష్ణంరాజు ఫిర్యాదు చేయగా తాజాగా గురువారం దీనికి సంబంధించిన పలు కీలక ఆధారాలను సమర్పించేందుకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


Also Read: ఆచూకీ తెలియని నర్సాపురం ఎంపీడీవో - కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు


Also Read: ఈ ఊళ్లో మహాత్మాగాంధీనే గ్రామ దేవత! గాంధీ ‘గాంధమ్మ’ అయ్యారు