Narsapuram MPDO Missing Mystery : నర్సాపురం ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ వ్యవహారం సస్పెన్స్ గా ఉంది. ఏలూరు కాల్వలో ఆయన దూకారేమోనన్న అనుమానంతో నాలుగు రోజుల పాటు గజ ఈతగాళ్ల సాయంతో గాలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఉద్యోగంలో ఒత్తిళ్లు, వైసీపీ నాయకులు కాంట్రాక్ట్ తీసుకున్న ఓ జల రవాణా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం పైగా బెదిరింపులకు పాల్పడటంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని కుటుబంసభ్యులు చెబుతున్నారు. సూసైడ్ లెటర్ కూడా రాసి పెట్టి వెళ్లడంతో సంచలనంగా మారింది. ఆయన అదృశ్యమయ్యి నాలుగు రోజులు గడిచినా ఎలాంటి సమాచారం లభించలేదు.
ఫెర్రీ బోట్ల వసూళ్లు చెల్లించని వైసీపీ నాయకులు
మూడున్నరేళ్లుగా నరసాపురం ఫెర్రీకి చెందిన బోట్లకు రూ.55 లక్షలు చెల్లించవలసి ఉందని, ప్రసాదరాజు అండదండలతో ఆ కాంట్రాక్టరు సొమ్ము చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ప్రసాదరాజు ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని, దీన్నుంచి బయటపడే మార్గం కనిపించడంలేదని పేర్కొన్నారు. 33 ఏళ్లు నిజాయితీగా పనిచేసిన తాను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అనుకోలేదని సూసైడ్ నోట్‌లో వెంకటరమణ ఆవేదన వ్యతక్తం చేశారు.
ఏలూరు కాల్వలో గాలింపు
ఎంపీడీవో వెంకటరమణ చివరిసారిగా మచిలీపట్నం రైల్వేస్టేషన్ నుంచి నేరుగా మధురానగర్ స్టేషన్‌లో దిగినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వేస్టేషన్ నుంచి కాల్వకట్ట వరకు సుమారు 2 కిలోమీటర్లు ఆయన నడిచినట్లు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో కాలువలోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ సిగల్ ఆధారంగా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒక వ్యక్తి నీళ్లలో దూకినట్లుగా పెద్దగా శబ్దం వచ్చిందని స్థానికులు కొంత మంది పోలీసులకు చెప్పారు. తండ్రి ఆచూకీ కోసం ఆయన కుమారులు ఏలూరు కాల్వ కట్టపైనే ఎదురు చూస్తున్నారు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కేసరపల్లి నుంచి విజయవాడ వైపు గాలిస్తున్నారు. రెండు బోట్లలో 30 మంది సిబ్బంది ఇందుకోసం పనిచేస్తున్నారు.
కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు
వెంకటరమణ కుటుంబసభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. ఉద్యోగంలో ఆయన ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొనేవారని అడిగి తెలుసకుున్నారు. సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని వెంకటరమణ ఆచూకీ కనిపెడతారని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మరోవైపు ఎంపీడీవో అదఅశ్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. వెంకటరమణ పవన్ కల్యాణ్ కు కూడా లేఖ రాశారు. వెంకటరమణ ఆత్మహత్య చేసుకుని ఉండరని ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగా వస్తారని ఆయన కుటుంబసభ్యులు ఆశతో ఉన్నారు.