Srikakulam District News: చాలా వరకూ పల్లెటూర్లలో గ్రామ దేవతలు ఉంటారు. ఆ ఊరి ప్రజలకు ప్రధాన దైవం ఆ గ్రామ దేవతే. తర్వాతే మిగతా దేవుళ్లను కొలుస్తారు. ఇక్కడ మాత్రం గ్రామ దేవతగా మహాత్మా గాంధీ ఉన్నారు.


గ్రామదేవతకు మొక్కుబడి చెల్లించుకొని ఏ శుభకార్యక్రమం అయినా ప్రారంభించడం అనవాయితీ. అందులో ఈ సీజన్లో గ్రామదేవతకు చెల్లించాల్సిన మొక్కుబడులు చెల్లిస్తే ఊరుఊరంతా ఆరోగ్యంగా ఉంటుందని వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయని నమ్మకం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మారవటి తర్వాత పూజలు చేస్తారు. మేళతాళాలతో ఊరు ఊరంతా కదిలి వెళ్లి అమ్మవారికి ముర్రాటలు, బోనాలు సమర్పించుకోవడానికి భాజాభజీంత్రులతో గ్రామాల్లో చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురంలో గాంధమ్మ పేరుతో జాతిపిత మహాత్మా గాంధీని గ్రామ దేవతగా కొలవడం సాంప్రదాయం కావడంతో ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఆకట్టుకుంటుంది.




గ్రామదేవత ఉత్సవం అంటే జంతు బలులు లేకుండా ఉండదు. అలాంటిది గాంధీ మహాత్ముడును కేదారిపురం గ్రామస్తుల కుల దేవుడి గ్రామదేవత కొలుస్తుండడంతో ప్రాణనష్టం లేకుండా నెయ్యిలతో చేసే పెద్ద సైజు ముద్దలను తయారు చేసి పూజిస్తారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏటా అషాడ మాసం ముగుస్తుందనగా గురువారం రోజున గాంధీ ఉత్సవం నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని కోరుకుంటూ మొక్కలు చెల్లించుకుంటారు. హింసను ప్రేరేపించకూడదన్న గాంధీ సిద్ధాంతాన్ని ఆచరిస్తామంటున్నారు. ఈ ఉత్సవం నిర్వహించాకే ఖరీఫ్ కి సంబంధించి వరి ఉడుపులు ప్రారంభించడం అనవాయితీ కావడం.. మహాత్మాగాంధీకి వారిచ్చే ప్రాధాన్యం అర్థమవుతుంది.


అంతేకాకుండా మహాత్మ గాంధీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే ఈ గ్రామదేవత పండగ కొనసాగడం మరోవిశేషం. గాంధీ ఉత్సవం రోజున పిల్లా పాపలతో ఊరు ఊరంతా కదులుతుంది. మేళతాళాలు, నృత్యాలతో గ్రామస్తులందరూ ఊరేగింపుతో గ్రామ నడిబొడ్డున మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పెట్టి దాని ముందు వెదురు బుట్టలో గాంధమ్మ చెక్క బొమ్మలను పెట్టి పూజలు చేసి జాతిభక్తిని చాటుకున్నారు. అమ్మవారికి చెల్లించినట్టే ఫలాలు, ముర్రాటలు గాంధమ్మకు సమర్పించుకున్నారు. వడపప్పు, నూతన వస్త్రాలు, పానకం వంటివి నైవేద్యంగా పెట్టి దీపధూపాలతో చేసిన పూజలు చూసి గ్రామేతరులు ఫిదా అయ్యారు. గాంధమ్మా చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ కోలాటాలు, భజనలు చేసి సందడి చేశారు. కేదారిపురం గ్రామం ప్రతి ఏటా ఖరీఫ్ పనులు ఆరంభించడానికి ముందు ఊరంతా కలిసి గాంధమ్మకు పూజించి సేద్యం చేస్తే పంటలు బాగా పండుతాయని వీరి నమ్మకం. గ్రామంలో మనుషులు, పశుసంపద ఆరోగ్యంగా ఉంటుందని వీరు నమ్మకంగా చెబుతున్నారు.