పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని , తెలంగాణను ప్రధాని మోదీ అవమానించారంటూ టీఆర్ఎస్ పెద్ద ఎత్తన నిరసనకు దిగింది. ప్రధాని నరేంద్రమోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మొత్తం నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలతో హోరెత్తించారు. టీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి పైసా ఇవ్వరు కానీ స్వంతకాళ్లపై నిలబడి ఎదుగుతున్న తెలంగాణపై విషం చిమ్మడం ఏమిటని టీఆర్ఎస్ నేతలు ధర్నాల్లో ప్రశ్నించారు.
తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మంత్రులు విమర్శించారు. అన్ని చోట్లా మంత్రులు ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ ప్రగతిని కోరాల్సిన ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. ర్యాలీల సందర్భంగా అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జనగామ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ నాయకులు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ర్యాలీలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. పట్టణాల్లో పురవీధుల గుండా నల్ల బ్యాడ్జీలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లోనూ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రధాని మోదీ అపహాస్యం చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో నిన్న ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ట్విట్టర్లో టీఆర్ఎస్ మద్దతుదారులు నిరసనలతో హోరెత్తించారు. ModiEnemyOfTelangana పేరుతో ట్విట్టర్‌లో హ్యాష్‌టాగ్‌లు పెట్టారు. గంటలోపే 25 వేలకు పైగా ట్వీట్లను టీఆర్ఎస్ మద్దతుదారులు ట్వీట్ చేశారు. ట్విట్టర్ ట్రెండింగ్‌లో టీఆర్ఎస్ మద్దతుదారుల ట్వీట్లు గంట పాటు మొదటి స్థానంలో ఉన్నాయి.
ప్రధాని మోదీ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పకపోతే నిరసనలు కొనసాగిస్తామని టీఆర్ఎస్ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. విశ్వాసం నింపాల్సిన చోట ప్రధాని మోదీ విద్వేషం నింపి రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణపై ముందు నుంచే మోదీకి పగ ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని అవమానిస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు.