BJP Plan In AP : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఎవరితోనూ పెట్టుకోదు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన బాగా దగ్గరయ్యాయని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం తాము టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని అంటోంది. అయితే జనసేనతో మాత్రం కలిసి వెళ్తామని నమ్మకంగా చెబుతోంది. కానీ జనసేన అధినేత మాత్రం ఇప్పటికే చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. వ్యూహం మార్చుకున్నానని తేల్చి చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ఆశలు వదులుకోలేదు. ఏపీలో ఎలాంటి రాజకీయం జరగబోతోంది ? జనసేనపై బీజేపీ నమ్మకమేంటి ?
2014 పొత్తులు రిపీట్ అయ్యే చాన్స్ ఉందా ?
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఎన్నికలకు కొంత కాలం ముందే పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరారు. కానీ అప్పుడే పార్టీ పెట్టినందున ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. దీంతో సీట్ల పంపకాల్లో పెద్దగా తేడాలు రాకుండానే పోటీ జరిగింది. విజయం సాధించారు. అదే పవన్ కల్యాణ్ కూడా అప్పట్లో సీట్లు కావాలని అడిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అంచనా వేయడం కష్టం. 2019 నాటికి పవన్ కల్యాణ్ తన బలం ఎంతో తేల్చుకోవాలని డిసైడయ్యారు. అందుకే ఒంటరి పోటీ చేశారు. అంతకు ముందు రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని టీడీపీ కూడా బీజేపీకి గుడ్ బై చెప్పింది. దీంతో కూటమి ముక్కలయింది. ఆ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేసి అందరూ ఘోర అవమానాల్ని ఎదుర్కొన్నారు. టీడీపీకి చరిత్రలో ఎప్పుడూ లేనంత తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ నోటా కంటే వెనుకబడింది. జనసేనాధినేత రెండు చోట్లా ఓడిపోయారు. అందుకే ఇప్పుడు 2014 కూటమిపై చర్చ జరుగుతోంది.
టీడీపీతో పొత్తు ప్రశ్నే లేదంటున్న బీజేపీ !
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రతీ సారి నష్టపోయామని బీజేపీ వాదిస్తోంది. అందుకే పొత్తులు పెట్టుకునే ప్రశ్నే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే రికార్డులు పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో అయినా..విభజిత రాష్ట్రంలో అయినా చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించింది. రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఎక్కువ సీట్లలో టీడీపీనే పోటీ చేసింది పదిహేను సీట్లను టీడీపీ. ఐదు సీట్లను బీజేపీ గెల్చుకుంది. అప్పుడు ఉన్న బలం కారణంగా ఆ పార్టీకి అదే ఎక్కువ. 2018 ముందస్తు ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యేకే పరిమితమయ్యారు. దిగ్గజ నేతలంతా టీడీపీ మద్దతు లేక డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ బలపడింది. కానీ ఏపీలో మాత్రం ఏ మాత్రం మెరుగుపడలేదు. టీడీపీతో పొత్తు లేక ఒక్కటంటే ఒక్క చోట కూడా డిపాజిట్లు తెచ్చుకోలేకపోయింది. టీడీపీతో విడిపోయి ఐదేళ్లవుతోంది..మరి తెలంగాణలోలా ఏమైనా బలపడ్డారా అంటే అదీ లేదు. మరి ఏం చూసుకుని.. టీడీపీతో పొత్తు ఉండటం వల్ల నష్టపోయామని అంటున్నారో కానీ.. పొత్తు లేకపోవడం వల్లనే కనీసం ప్రాతినిధ్యం ఉండటం లేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కానీ బీజేపీ నేతలు పొత్తు ఉంటే తమను బీజేపీ ఎదగనీయడం లేదంటున్నారు.
బీజేపీతో పరిచయాలు పెంచుకుంటున్న చంద్రబాబు !
విభజన హామీలు నెరవేర్చడం లేదని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబునాయుడు .. ఎదురు దెబ్బతినడంతో ఇప్పుడు రూటు మార్చుకున్నారు. బీజేపీ పెద్దలతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇటీవల మోదీతో ముఖాముఖి సమావేశం అయ్యారు. అమిత్ షాతో లోకేష్ సమావేశం అయ్యారన్న ప్రచారం జాతీయ మీడియాలో జరిగింది. ఎన్డీఏలో టీడీపీ చేరుతుందని చెప్పుకున్నారు. తాజాగా అమిత్ షా పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నేరుగా షాకి ఫోన్ చేసి మాట్లాడారు. ఎలా చూసినా బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. మరి ఆయన కూటమిలోకి బీజేపీని కూడా తేవాలనుకుంటున్నారా? అన్నది మాత్రం సస్పెన్స్.
తెలంగాణతో ముడిపడి ఉన్న రాజకీయాలు!
గతంలో జాతీయ మీడియాలో ప్రచారం ప్రకారం చూస్తే.. తెలంగాణలో బీజేపీకి సహకారాన్ని టీడీపీ అందిస్తుంది. ఏపీలో అలాంటి సహకారమే బీజేపీ అందిస్తుంది. ఇప్పటికిప్పుడు టీడీపీ తెలంగాణలో పోటీ చేయడం కష్టం. బీజేపీకి ఎక్కడ అవసరమో అక్కడ పోటీ చేయవచ్చు.. అదే ప్లాన్ ఏపీలో అమలు చేయవచ్చు. అంటే నేరుగా పొత్తులు పెట్టుకోకుండా పరోక్ష సహకారం అన్నమాట. అలాంటిదేమైనా ఉంటే.. వైసీపీ, బీజేపీ, టీడీపీ- జనసేన ఎన్నికల్లో పోటీ ఉంటాయి. ఎలాంటి పోటీ ఉంటుందన్నది ఎన్నికలకు ముందే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.