Jagan To Vizag : రెండు, మూడు నెలల్లో విశాఖ నుంచి పాలన అని ఉత్తరాంధ్ర మంత్రులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే మూడు రాజధానుల అంశం కోర్టులో ఉందని ఇలా ఎలా ప్రకటనలు చేస్తారని ఇతర పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ మంత్రులు చెబుతున్నది రాజధానుల గురించి కాదు.. కేవలం పాలన గురించే. విశాఖ నుంచి జగన్ పాలన చేస్తారని చెబుతున్నారు. అప్పుడు అది అధికారికంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకపోవచ్చు కానీ అనధికారికంగా అవుతుందని అంటున్నారు.
విశాఖ నుంచి జగన్ పాలన చేస్తారంటున్న మంత్రులు
చట్టపరంగా ఎదురవుతున్న అడ్డంకులకు కొత్త దారిలో పరిష్కారం వెదుక్కోవాలని జగన్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ మంత్రులు వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఏప్రిల్ నుంచి రాజధాని అని చెప్పడం లేదు. జగన్ పాలన చేస్తారని చెబుతున్నారు. గతంలో తాము వాదించినట్లుగా.. సీఎం పాలన ఎక్కడి నుంచైనా చేయవచ్చని.. ఎవరూ అడ్డుకోలేరని వారు వాదించవచ్చు. సీఎం జగన్ రాజధాని నుంచే పరిపాలించాలని లేదు. అలాగని సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని కాదు. సీఎం జగన్ కర్నూలు లేదా విశాఖ నుంచి పరిపాలన చేస్తే ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ఈ కోణంలోనే విశాఖ నుంచి ఆయన పరిపాలన చేయవచ్చని అంటున్నారు.
మంత్రి బొత్స మాటల అర్థం అదేనా..?
విశాఖ రాజధానిగా పాలనపై ఇప్పటికే మంత్రులు స్పష్టత ఇచ్చారు. త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విజయనగరంలో మాట్లాడారు. రెండు, మూడు నెలల్లోనే విశాఖ రాజధాని అవుతుందని చెప్పారు. “వచ్చే రెండు మూడు నెలల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వాలన్నది మా కోరిక. అది అవుతుంది కూడా. రాష్ట్ర ప్రజలు కూడా సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఇదంతా జరుగుతుంది. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన త్వరలోనే ఉంటుంది" అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం 2023 ఏప్రిల్ నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని గతంలోనే తెలియజేశారు...
చట్టపరంగా ఉండదు..!
సీఎం ఎక్కడ నుంచి అయినా పరిపాలించవచ్చని.. ఫలానా చోటే ఉండాలన్న రూలేం లేదని వైఎస్ఆర్సీపీ వర్గాలు కొంత కాలంగా వాదిస్తున్నాయి. అదే సమయంలో రాజ్యాంగంలో రాజధాని అనేదే లేదని అంటున్నారు. ఈ వాదనలతో.. సుప్రీంకోర్టులో అమరావతి అంశం తేలక పోయి నా విశాఖ నుంచి జగన్ పాలన చేయాలని నిర్ణయించుకున్నారు. అది చట్ట పరంగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరి జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అవుతుందా? వ్యవహారం కోర్టుల్లో ఉన్నప్పుడు ఓ ముఖ్య మంత్రి స్థానంలో ఉన్న నేత అలా చేయవచ్చా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది.
సిద్ధమవుతున్న పభుత్వ భవనాలు...!
విశాఖ నుంచి పాలనకు అనుగుణంగా ప్రభుత్వ భవనాల ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రిషికొండపై నిర్మిస్తున్న భవనాలు సిద్ధం అయ్యాక ప్రభుత్వ శాఖల షిఫ్టింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల విశాఖలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆ పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. మంత్రుల కామెంట్లు, ప్రభుత్వ పర చర్యలు చూస్తుంటే మరో రెండు, మూడు నెలల్లో విశాఖ నుంచి పాలన ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడు రాజధానులు బిల్లు మాటెలా ఉన్నా సీఎం జగన్ మాత్రం విశాఖలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వైసిపీ మంత్రులు పదేపదే చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టే పరిణామాలు అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి.