YSRCP Tension :    ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సర్పంచ్‌లు ప్రతీ జిల్లాలో ఆందోళన చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నిధుల కోసం వివిధ పద్దతుల్లో నిరసనలు తెలుపుతున్నారు. దీనికి కారణం రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చే నిధులు కూడా మళ్లించుకోవడం. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేయాలన్నా.. నిధులు ఉండటం లేదు. దీంతో సర్పంచ్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సొంత పార్టీ ప్రభుత్వం అని కూడా చూడకుండా నిరసనలకు దిగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. పాలన పరంగా పక్కన పెడితే... వైసీపీ దిగువ స్థాయి క్యాడర్‌ను ఇబ్బంది పెట్టి హైకమాండ్ ఏం సాధిస్తుంది ? ఆర్థికంగా మేలు చేయకపోగా.. ఇబ్బందులు పెడితే రేపు మరోసారి గెలుపునకు సహకరిస్తారా ? సొంత క్యాడర్ విషయంలో వైఎస్ఆర్‌సీపీ వ్యూహం తేడాగా ఉందా ?


గ్రామాల్లో సర్పంచ్‌లదే ఓటింగ్‌లో కీలక పాత్ర !
 
గ్రామ సర్పంచే  రారాజు. లోకల్‌గా శాసించేది ఆయనే. ఆయా రాజకీయ పక్షాలకు అండ, దండ ఇచ్చే ది ఆయనే. ఆయన వెంటే వార్డు సభ్యు లు కూడా.  రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చూపేవారు. ఎమ్మెల్యేలు ఎన్నిక కావాల్సి వస్తే గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యులదే కీలక పాత్ర. అందుకనే ఎమ్మెల్యే అభ్యర్థులంతా వారి ఇళ్ళ ముందు వాలిపోయేవారు. వారిని ప్రసన్నం చేసు కోవడానికి నానా తిప్పలు పడేవారు.  అనుకూల ఫలితాలకు వీరి నిర్ణయా లు తుది తీర్పులా ఉండేవి. ఊళ్ళో ఏ పని కావాలన్నా సర్పంచ్‌ రాజ ముద్ర కావాల్సిందే.. సిఫార్సులకు తిరుగుండేది కాదు. అంతలా పట్టు వారికి ఉంటుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం పంచాయతీల్ని గెల్చుకున్నామని  వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. 


నిధుల కోసం రోడ్డెక్కుతున్న సర్పంచ్‌లు ! 


సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఎన్నికైనప్పటి నుండి అసలు నిధులే ఉండటం లేదు.  గెలిచిన వారిలో అత్యధికులు తమ స్తోమతను బట్టి ఎడాపెడా ఖర్చు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇంకొందరు అప్పులపాలయ్యారు. చివరికి గ్రామాల్లో పనులు చేయించడానికి కూడా నిధులు ఉండటం లేదు. గతంలో ఫైనాన్స్ కమషన్ నిధులతో గ్రామాల్లో పారిశుధ్యం, రోడ్ల నిర్మాణంతోపాటు ప్రత్యేక భవనాలు గ్రామ శాశ్వత అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేసుకునేవారు.  కి వీధి లైట్లు దగ్గర నుంచి మంచినీటి సరఫరా వరకు సర్పంచ్‌లదే బాధ్యత. రానురాను ఇప్పుడు ఒక లైను పాడైతో మరో లైటు పెట్టుకునేందుకు దిక్కుమొక్కు లేదు.  మంచినీటి ట్యాంకు మోటారు చెడిపోతే బాగు చేయించేందుకు నయా పైసా సాధారణ నిధులు లేవు. గతంలో చేసిన రిపేర్లకు  బిల్లులు చెల్లించకపోవడంతో మళ్లీ మళ్లీ రిపేర్లు చేయించలేకపోతున్నారు. 


అప్పుల పాలవుతున్న వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ !


మూడున్నరేళ్ళల్లో ఆర్‌బీకేలు, సచివాలయాలు, ఐసీడీఎస్‌ బిల్డింగ్‌లు, అంగన్‌ వాడీ బిల్డింగ్‌ల నిర్మాణాలు ప్రారంభించారు. ఈ పనులన్నీ వైఎస్ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నేతలకే ఇప్పించారు. కానీ బిల్లులు రాకపోవడంతో చాలా వరకూ అక్కడక్కడ పునాదిరాయి వేసి చేతులు దులిపేసుకున్నారు. పనులు చేసిన వాళ్లు బిల్లులు రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు.  గౌరవ వేతనంకూ దిక్కులేదుసర్పంచ్‌లు, స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలుగుదేశం హయాంలో కాస్తంత గౌరవ వేతనం పెంచేలా జీవోలు జారీచేశారు. 1995 నుంచి వరుస జీవోలు వెలువడ్డాయి. తెలుగుదేశం పాలన చరమాంకంలో సర్పంచ్‌లకు ప్రతీ నెలా మూడు వేల రూపాయలు గౌరవ వేతనంగా  ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి వేతనమే ఇవ్వడం లేదని వాపోతున్నారు.  అందుకనే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో సర్పంచ్‌లతా బిక్షాటనకు దిగుతున్నారు. ఉమ్మడి పశ్చిమలోనూ ఇక అటో ఇటో తేల్చుకోవడానికి వైసీపీ అనుకూల సర్పంచ్‌లు సైతం రోడ్డుకెక్కేందుకు సిద్ధపడుతున్నారు.  


క్యాడర్ అసంతృప్తి వైఎస్ఆర్సీపీకి నష్టమే !


ఇలా ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు ఏ మాత్రం లాభం లేకుండా అప్పుల పాలు చేస్తే వారు రేపు ఎన్నికల్లో పార్టీని గెలిపించాలన్న కసితో పని చేయడం కష్టమే. బిల్లులు రాకపోతే.. ఇక రావేమోనన్న ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో .. క్యాడర్‌ ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.