KCR Vs Goverer :   తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులు కూడా వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఇంకా ఆమోదం తెలుపలేదు గవర్నర్. దీనిపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. అందులో యూనివర్శిటీల్లో నియామకాల బిల్లు కూడా ఉంది. విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌తో గవర్నర్‌కు ఉన్న అధికారులను కట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. బెంగాల్, కేరళ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్నే తెలంగాణలోనూ తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 


యూనివర్శిటీలకు గవర్నర్‌ను చాన్సలర్‌గా తొలగిస్తూ బెంగాల్, కేరళ ప్రభుత్వాల బిల్లులు


బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న బెంగాల్, కేరళల్లో గవర్నర్ల నుంచి చిక్కులు ఎక్కువగా ఉండటంతో  ఆ  రాష్ట్రాలు చాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఉన్న నియమ నిబంధనలను మారుస్తూ చట్టాలు చేశారు.  రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఇక నుంచి గవర్నర్ సారథ్యం అవసరం లేదని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు ప్రకటించాయి.  తెలంగాణలోనూ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మ‌ధ్య అంతరం పెరిగిపోయాయి. కేరళ, బెంగాల్‌ తరహాలో కులపతిగా గవర్నర్‌ను తప్పించి సీఎంకు బాధ్యతలను కట్టబెట్టేలా విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరించాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


ఉమ్మడి ఏపీలోని యూనివర్శిటీల చట్టమే ప్రస్తుతం అమల్లో !  


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న‌ విశ్వవిద్యాలయాల చట్టాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌గా గవర్నర్‌ వ్యవహరిస్తారు. వైస్ చాన్స్‌లర్‌  నియామకంలో గవర్నర్‌దే కీలకపాత్ర. ప్రభుత్వం అన్వేషణ కమిటీలను ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి అనుభవం, యోగ్యతలున్న విద్యావేత్తల పేర్లను ఎంపిక చేసే సంప్రదాయం ఉంది. ప్రభుత్వం ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను రాజ్‌భవన్‌కు పంపిస్తే అందులో ప్రభుత్వం ప్రతిపాదించిన పేరును ఉపకులపతిగా గవర్నర్ చాన్స్‌లర్‌ హోదాలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఖరారు చేసిన విద్యావేత్తకు సంబంధించి ఎటువంటి ఆరోపణలున్నా గవర్నర్‌ ఆ పేరును నిలుపుదల చేసి మరో పేరును ప్రతిపాదించే అవకాశముంది.ఇక్కడే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి.  తెలంగాణ ప్రభుత్వం పది మంది ఉపకులపతులను ఎంపిక చేస్తూ తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపగా తమిళిసై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తర్వాత కేసీఆర్ జోక్యంతో అనుమతించారు. ఇప్పటికీ ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రిని చాన్స్‌లర్‌గా నియమించే బిల్లును కూడా గవర్నర్‌ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంది.  


అధ్యాపకుల నియామకాల్లోనూ గవర్నర్ పాత్ర కీలకం ! 


విశ్వవిద్యాలయాలు చేపట్టే అధ్యాపకుల నియామకాల్లో గవర్నర్‌ పాత్ర కీలకం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పది విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 1500లకుపైగా నియామకాలను చేపట్టేందుకు సన్నద్ధయింది. ఇందు కోసం ప్రత్యేకంగా నియామక బోర్డు ఏర్పాటు చేస్తూ చట్టం చేసినా గవర్నర్ ఆమోదించలేదు.  ప్రభుత్వం పెద్దఎత్తున బోధనా సిబ్బందిని నియమిస్తుండడంతో గవర్నర్‌ కీలకం కానున్నారని పశ్చిమ బంగాల్‌ తరహాలోనే గవర్నర్‌కున్న అధికారాలకు కట్టడి వేయాలని ముఖ్యమంత్రి కులపతిగా వ్యవహరించేలా చూస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 


అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ! 


డిసెంబర్‌లో వారం రోజులపాటు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, ఆర్థికంగా అష్ట దిగ్బంధనం చేయడా న్ని ఎండగట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సమావేశాల్లోనే విశ్వ విద్యాలయాల బిల్లు కూడా పెట్టాలనుకుంటున్నారు. అయితే వర్సిటీల చాన్సలర్‌ పదవి నుంచి గవర్నర్‌ను తప్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందినా, దానిపై సంతకం చేయాల్సింది గవర్నరే కావడం అసలు ట్విస్ట్.