పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో శీతాకాల సమావేశాల్లో తాము లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అంశం వంటి అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదియ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.


కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తమ పార్టీ లేవనెత్తే అంశాలను తెలిపారు. అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల , ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదియ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని జైరాం రమేష్ వెల్లడించారు.


సోనియా గాంధీ నివాసంలో సమావేశం
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వారు అనుసరించాల్సిన వ్యూహాలను, లేవనెత్తాల్సిన అంశాల గురించి నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ ఇంట్లో శనివారం సమావేశం అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మాట్లాడుతూ " కాంగ్రెస్ కుల గణనకు మద్దతుగా ఉంది, గణన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి  మాట్లాడుతున్నారు. ఐదు మంది సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు మద్దతు ఇవ్వగా, ఇద్దరు వ్యతిరేకించారు. దీనిపై సభలో చర్చకు మేము పట్టుపడతాం. ఈ సమావేశాల్లో జరగనున్న చర్చల్లో నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ధరల పెరుగుదల, సైబర్ క్రైమ్, రూపాయి పతనం, తక్కువ ఎగుమతులు, ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యము వంటి అనేక విషయాలు గురించి చర్చించాం" అని తెలిపారు.






ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నిర్వహణ కారణంగా ఒక నెల ఆలస్యంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందే ఈ బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగనున్నాయి. మధ్య భారత్ నుంచి ఉత్తర భారతదేశం వైపూ సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. కనుక రాహుల్ తో పాటు ఆయన వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొనే కొందరు నేతలు ఈ సమావేశాలలో పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాకపోవడంతో పాత పార్లమెంట్ భవనంలోనే ఈ సమావేశాలు జరగనున్నాయి.