ఎమ్మెల్యేలకు సీఎం  జగన్ ఇచ్చిన గడువు పూర్తవుతోందా.. గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో ఏపీ  సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే చెప్పనున్నారా.. తాజా పరిణామాలు చూస్తే ఇలాగే  ఉన్నాయి. ఈ నెల రెండో వారంలో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇచ్చిన జగన్ వచ్చే సమావేశంలో ఎలా రియాక్ట్ అవుతారన్న అంశం పై ఉత్కంఠ నెలకొంది. 
ఎమ్మెల్యేల పని తీరుపై నజర్...
సీఎం జగన్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పని తీరుపై రకరకాలుగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇంచుమించు ప్రతి రోజు ఏదో ఒక సర్వే రిపోర్ట్ సీఎం దగ్గరకు వస్తోంది. పార్టీ పరిస్థితి ఎమ్మెల్యేల పని తీరును ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో తీసుకుంటున్న సీఎం ఈ వ్యవహరాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు గడప గడపకు తిరుగుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లాలని  సీఎం ఇచ్చిన ఆదేశాలతో ప్రతి గడప ను టచ్ చేస్తున్నారు. తలుపుతట్టి మరి ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల  నిరసనలు..కొన్ని  చోట్ల  పొగడ్తలతో రకరకాల అభిప్రాయల సేకరణతో గడప గడప కార్యక్రమం జరుగుతోంది. 
కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమానికి దూరంగా  ఉన్నప్పటికి, సీఎం జగన్ వద్దకు రిపోర్ట్ లు వెళుతున్న క్రమంలో అందరూ ఎప్పుడో ఒకప్పుడు గడప గడప  కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సీఎంకు అందుతున్న రిపోర్ట్ లపై పార్టి వర్గాల్లో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. పార్టిని ప్రభుత్వాన్ని కలుపుకొని ముందుకువెళితేనే వచ్చే ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించవచ్చన్నది జగన్ అభిప్రాయం. అందులో భాగంగానే 175 సీట్ల టార్గెట్ ను జగన్ ప్రకటించారు. అదే టార్గెట్ ను ఎమ్మెల్యేలకు పెట్టి, విజయమే అంతిమంగా పని తీరు ఉండాలన్న స్పష్టమయిన లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఎమ్మెల్యేలు అంతా తప్పనిసరిగా గడప గడపలో పాల్గొనక తప్పలేదు.
వచ్చే వారంలో జగన్ సమావేశం...
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయం వేదికగా 175 నియోజకవర్గాల్లోని ఇంఛార్జ్ లు, ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం అయ్యారు. అదే సమావేశంలో ఎమ్మెల్యేలు గడప.. గడపకు ప్రభుత్వం జరుగుతున్న తీరుపై జగన్ సమీక్షించారు. ఒక్కో ఎమ్మెల్యే రోజులో ఎన్ని గంటలు, గడప గడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ప్రజలకు దూరంగా ఎన్ని రోజులు ఉన్నారు, అనే విషయాలను జగన్ ప్రతి ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఎమ్మెల్యేలు ఆశ్చర్యానికి గురయ్యారు. గడప.. గడప పేరుతో మెక్కుబడిగా ప్రజల్లోకి వెళ్ళి మార్నింగ్ వాక్ తరహాలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఎమ్మెల్యలు ఎవరనే విషయాలను కూడా జగన్ నవ్వుతూనే అదే సమావేశంలో తెలియజేశారు. దాదాపుగా 27మంది ఎమ్మెల్యే లపై జగన్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అందులో రోజా, కొడాలి నానితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర లాంటి నేతలు ఉండటం కొసమెరుపు. ఇక మరోసారి అత్యంత కీలకమయిన ఈ సమావేశాన్ని వచ్చే వారంలో నిర్వహించేందుకు జగన్ రెడీ అవుతున్నారు. 
త్వరలో  సీఎం జగన్ ఎమ్మెల్యేలతో  కీలక సమీక్షా సమావేశం నిర్వహింస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. ఈ  సమీక్షలో ఎమ్మెల్యేల తాజా పరిస్థితిని మరో సారి జగన్ స్వయంగా సమీక్షిస్తారు. ఏ  ఎమ్మెల్యే  పనితీరు  ఎలా  ఉంది.. ఎవరికి  టికెట్లు.. ఎవరికి  ఇక్కట్లు అనే  దాని పై ఒక  క్లారిటీ  వచ్చే అవకాశం ఉందని పార్టిలో ఇప్పటికే ప్రచారం మెదలైంది. సీఎం  ఇప్పటికే  కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు  విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేలకు గడప గడపకు కార్యక్రమానికి పెద్దగా టైం కూడా ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే  2023 లో అంతా ఎన్నికల  మూడ్ ఉంటుంది. వచ్చే  బడ్జెట్  సమావేశాల తర్వాత నుంచి  ఇక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టే  అవకాశం ఉండడంతో ఈ నెలలో ఎమ్మెల్యే లతో జరిగే సమావేశం కీలకం కానుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆశావహులు కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు మెదలుపెట్టారని అంటున్నారు.