Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఓడిపోతామనే భయంతోనే వైసీపీ ప్రభుత్వం టీచర్లకు ఎన్నికల విధులు తొలగించిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ విమర్శలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన... ఉపాధ్యాయుల వినతి మేరకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చామని మంత్రి బొత్స అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తున్నారన్నారు. ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరిగే "జయహో బీసీ" మహాసభను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి తప్పించారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ విమర్శించారని ఓ విలేకరి మంత్రిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స... లోకేశ్ ను వచ్చి టీచర్లను అడగమనండి అన్నారు. టీచర్లే మాకు ఏవిధమైన విధులు ఉండకూడదని కోరారన్నారు. బోధించడం తప్ప ఏ విధమైన కార్యక్రమాలు అప్పగించవద్దని రిక్వెస్ట్‌ చేశారన్నారు. ఈ వినతిని పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి వెసులుబాటు కల్పించామన్నారు.


బోధనేతర విధులకు మినహాయింపు


ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.  ఒక్క ఎన్నికల విధులు మాత్రమే కాకుండా... బోధనేతల విధులు ఇక టీచర్లకు కేటాయించకుండా నిర్ణయం తీసుకున్నారు. జనగణన వంటి వాటికి కూడా టీచర్ల సేవలు తీసుకోరు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచేలా వారి సర్వీసు రూల్స్‌కు సవరణ  చేసే ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.  గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. తర్వాతి అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకువస్తారు. బోధనేతర పనులు అంటే ఇక ఏ ఇతర పనినీ టీచర్లు చేయకూడదు. అప్పుడు సాధారణ పనులతో కీలకమైన ఎన్నికలు కూడా వారి నుంచి దూరమవుతాయి. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత టీచర్లే గుర్తుకువచ్చేలా వారిని వినియోగించుకుంటున్నారు. ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్‌ వరకు వారే ఉంటారు.  ఏపీలో ఉపాధ్యాయులు బోధనపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పొడవునా బోధనతో పాటు ఎన్నికలు, జనగణన, టీకాల పేరుతో బోధనేతర విధుల్లో బిజీగా ఉంటున్న వీరికి ఓ రకంగా ఊరట కల్పించే విషయం అనుకోవచ్చు.  


ఉపాధ్యాయులు హర్షం! 


ఏపీలో విద్యాసంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జాతీయ విద్యావిధానం అమలుతో పాటు పలు విద్యాసంస్కరణల్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్లకు సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తుంది. చాలా కాలంగా వారు బోధనేతర విధుల పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి అవసరం వచ్చినా టీచర్లనే వినియోగించుకుంటూ ఉంటుందన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి పనులన్నీ చేయడంతో ఇకవారికి విద్యార్థుల చదువు గురించి ఆలోచించే తీరిక లేకుండా పోతోంది. బోధనేతర పనుల వల్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ అసలు పనిచేసే అవకాశం లేకుండా పోతోందన్న విమర్శలు వస్తున్న క్రమంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.