Bandi Sanjay : బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 6వ రోజు కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోకి పాదయాత్ర ప్రవేశించింది. దిలావర్ పూర్ లోని ఎల్లమ్మ తల్లిని బండి సంజయ్ దర్శించుకున్నారు. దిలావర్ పూర్ లోని 'జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల'లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులకు బ్యాగ్స్, బుక్స్, బిస్కట్స్ పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో దివ్యాంగులతో బండి సంజయ్ మాట్లాడారు. ఆ తర్వాత దిలావర్ పూర్ బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడదామన్నారు. తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్ధం అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చినా ఒరిగిందేంలేదన్నారు. డబుల్ ఇండ్లు రాలేదన్నారు. ఆత్మహత్యలు ఆగలేదు, ఆకలిచావులున్నాయ్ అన్నారు.
రైతులు బికారీలు, కేసీఆర్ కోటీశ్వరుడు
"కేసీఆర్ బిడ్డకు నోటీసులిస్తే తెలంగాణ ఎందుకు ధర్నా చేయాలి?. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుంది. 3 నెలలుగా ఆసరా పింఛన్లు నిలిచిపోయాయి. ఇప్పటికే 2 నెలల ఫించన్ ను కట్ చేశారు. ఫాంహౌజ్ లో సాగు చేసిన కేసీఆర్ కోటీశ్వరుడు ఎట్లా అయ్యారు? ఆరుగాలం పండించిన రైతులు బికారీలు ఎందుకు అవుతున్నారు?
వడ్ల కొనుగోలు పైసలన్నీ ఇచ్చేది కేంద్రమే. వడ్ల సేకరణలో కేసీఆర్ చేసేది పెద్ద కుట్ర. ఎకరానికి ఎరువుల పేరుతో రూ.30 వేల సబ్సిడీ ఇస్తోంది కేంద్రమే. రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ పెట్టారు." - బండి సంజయ్
తెలంగాణ ఎందుకు ధర్నా చేయాలి
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితులున్నాయో... రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ వచ్చాక డబుల్ బెడ్రూం ఇండ్లు రాలే, ఉద్యోగాలు రాలే, నిరుద్యోగ భృతి అందలే, రుణమాఫీ రాలే, రైతుల ఆత్మహత్యలు ఆగలే" అన్నారు. బడ్జెట్ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి సాధించిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బిడ్డకు లిక్కర్ స్కాంలో నోటీసులిస్తే... తెలంగాణ ప్రజలు ఎందుకు ధర్నా చేయాలని ప్రశ్నించారు. 1400 మంది పేదల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొట్టడానికి తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా
కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కవితకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలు ధర్నా చేయాలంట అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కు ఎన్ని మద్యం షాపులు ఉన్నాయని ప్రశ్నించారు. ఊర్లో గుడి, బడి లేకపోయినా బెల్ట్ షాపులు మాత్రం ఉంటాయన్నారు. కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో లిక్కర్, క్యాసినోలో పెట్టుబడులు పెట్టిందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, దళిత బంధు లేదు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి లేదని మండిపడ్డారు. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేయలేదన్నారు. చదువుకుందామంటే కాలేజీలు లేవు.... చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవన్నారు. కేసీఆర్ ను అభివృద్ధి చేయమంటే పైసలు లేవంటున్నారని, వేల కోట్లు దండుకోవడానికి మాత్రం పైసలు ఉంటాయన్నారు. లిక్కర్ దందా, డ్రగ్స్, స్యాండ్ ఇలా అన్నీ దందాలు కేసీఆర్ వే అంటూ మండిపడ్డారు.
పెళ్లికి పిల్లనివ్వని పరిస్థితి
"తెలంగాణకు మోదీ 2,40,000 ఇండ్లను మంజూరు చేస్తే కేసీఆర్ ఇక్కడ ఎన్ని ఇల్లు కట్టించాడు?. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక, కనీసం పెళ్లికి పిల్లనివ్వని పరిస్థితి నెలకొంది. రైతులను బికారీలుగా మార్చిండు. వరి వేస్తే ఉరే అంటాడు. సన్న వడ్లు, దొడ్డు వడ్లు అంటూ రైతులను ఆగం చేసిండు. సన్నవడ్లు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు ఈ ఎనిమిదేళ్లలో ఒక్క పైసా కూడా పంట నష్టం కింద పరిహారం ఇవ్వలేదు. రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇవ్వమంటే... రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది. ధాన్యం సేకరణలో నిధులను మంజూరు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. అన్నదాతలకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఒక్క ఎకరానికి సబ్సిడీపై 30 వేల రూపాయలు ఇస్తున్నది మోదీ ప్రభుత్వమే. 'కిసాన్ రైతు సమ్మాన్ నిధి' కింద ఎకరానికి రైతుకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు.పుట్టబోయే బిడ్డ పేరుపై కూడా లక్ష రూపాయల అప్పు పెట్టిండు. " - బండి సంజయ్