Minister Gudivada Amarnath : రాష్ట్రంలో పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడటం లేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి విఘాతం కలిగించే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి తీవ్రంగా స్పందించారు. శనివారం విశాఖలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని, ఇందులో భాగంగానే అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందన్న  ఆరోపణలలో వాస్తవంలేదన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. అమర్ రాజా కంపెనీని వెళ్లగొట్టడానికి ప్రభుత్వం హుకుం జారీ చేసిందన్న ప్రచారం నీచంగా ఉందన్నారు. అమర్ రాజా యాజమాన్యం ఎప్పుడైనా, ఏపీలో ఉండలేకపోతున్నాం, పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని చెప్పిందా? అని నిలదీశారు.  


కాలుష్య నియంత్రణకు చట్టపరంగా చర్యలు 


అమర్ రాజా పరిశ్రమలు ఏపీలో మాత్రమే ఉండాలని వేరే రాష్ట్రంలో ఉండకూడదన్న నిబంధన ఏమైనా ఉందా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. అమర్ రాజాకు చెందిన పలు కంపెనీలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నడుస్తున్నాయని గుర్తు చేశారు. హీరో మోటార్స్ ఏపీలో వ్యాపార కార్యరూపాలు కొనసాగిస్తున్నాయని, అందువలన ఈ సంస్థ దేశంలో మరెక్కడా తమ వ్యాపారాన్ని విస్తరించకూడదని ఏపీ ప్రభుత్వం ఎప్పుడైనా నిబంధనలు పెట్టిందా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. అమర్ రాజా సంస్థ టీడీపీ ఎంపీకి సంబంధించింది కాబట్టి తప్పుడు కథనాలు రాస్తున్నాయని అమర్నాథ్ మండిపడ్డారు. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అమర్ రాజా కంపెనీ నుంచి కాలుష్యం విడుదలవుతుందని గుర్తించి నోటీసులు ఇచ్చామన్నారు. దీనిపై వారు హైకోర్టుకు వెళ్లగా కాలుష్య నియంత్రణకు చట్టపరంగా తీసుకోవలసిన చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అమర్ రాజా యాజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఆ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోందని మంత్రి అమర్నాథ్ వివరణ ఇచ్చారు. ప్రజలకు హాని కలిగించకుండా నడిపే కంపెనీలకు ప్రభుత్వం ఎంతైనా సాయం చేస్తుందని అమర్నాథ్ తెలియజేశారు. 


ఎన్ని జాకీలు పెట్టి లేపినా టీడీపీ లేవదు


టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్ లో ఉన్నా, హెరిటేజ్ సామ్రాజ్యమంతా ఆంధ్రప్రదేశ్ లో విస్తరించి ఉందని మంత్రి అమర్ నాథ్ అన్నారు. హెరిటేజ్ జోలికి ఎప్పుడైనా మా ప్రభుత్వం వెళ్లిందా? అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలను తాము రాజకీయ కోణంలోనే చూస్తే చంద్రబాబు ఏపీలో హెరిటేజ్ కంపెనీని నడిపించగలరా?  అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిశ్రమలపై కక్ష కట్టి ఉంటే ఇప్పటికీ ఇవి సజావుగా ఎలా నడుస్తున్నాయని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను తీసుకువచ్చి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారన్నారు.  టీడీపీని ఎన్ని జాకీలు పెట్టి లేపినా సాధ్యం కాదని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మైకు చేతపట్టుకుని మాట్లాడలేని చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుకోవడం దేనికి? అని నిలదీశారు.  


దేశ జీడీపీ కన్నా ఏపీ జీడీపీ అధికం 


 ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా ఉందని, దేశ జీడీపీ కన్నా రెండు శాతం అధికంగా ఏపీ జీడీపీ ఉందని మంత్రి అమర్నాథ్ వివరించారు. రాష్ట్రంలో పలు పరిశ్రమలను ప్రారంభించామని, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశామన్నారు. సముద్రతీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని అమర్నాథ్ వెల్లడించారు. కాకినాడలో సుమారు వంద కోట్ల రూపాయలతో యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఆక్వా ఎగుమతులలో 45 శాతం ఏపీ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. సీఎం జగన్ పారిశ్రామిక ప్రణాళిక వాస్తవాలకు దగ్గరగా ఉందని అమర్నాథ్ చెప్పారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో మూడుసార్లు నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్లలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకున్నారని,  వాస్తవానికి 34 వేల రూపాయల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని అమర్నాథ్ స్పష్టం చేశారు.  కొద్దిరోజుల కిందట చంద్రబాబు తన ప్రసంగంలో  ఇవి తనకు చివరి ఎన్నికలను చెప్పుకొని, ప్రజల నుంచి సానుభూతి పొందాలనుకున్నారని, అది కాస్త రివర్స్ కావడంతో ఇప్పుడు ఈ రాష్ట్రానికే చివరి ఎన్నికలు అని చెప్పడం చూస్తూ ఉంటే చంద్రబాబు మతి చెదిరినట్టు అర్థం అవుతుందన్నారు.