డబుల్ ధమాకా... డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్... డబుల్ గెస్టులు... డబుల్ సందడి... ఎక్కడ కూడా 'తగ్గేదే లే' అంటూ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముందుకు వెళుతున్నారు. 'ఆహా' ఓటీటీ (Aha OTT Telugu) కోసం ఆయన హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్' (Unstoppable). ఫస్ట్ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయ్యింది. ఇప్పుడు సెకండ్ సీజన్‌లో డబుల్ గెస్టులతో సందడి చేస్తున్నారు.


నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అతిథులుగా 'అన్‌స్టాపబుల్ 2' స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌తో ఒక ఎపిసోడ్... అడివి శేష్, శర్వానంద్‌తో మరో ఎపిసోడ్... నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, రాధికా శరత్ కుమార్‌లతో మరో ఎపిసోడ్... చేశారు. త్వరలో సీనియర్ హీరోయిన్లు ఇద్దరిని తీసుకు వస్తున్నట్లు సమాచారం.
 
'జయ'ప్రద... 'జయ'సుధ!
సీనియర్ హీరోయిన్లు జయప్రద, జయసుధలతో 'అన్‌స్టాపబుల్ 2' కోసం ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. బాలయ్యతో పాటు వాళ్ళిద్దరి డేట్స్ చూసుకుని షూట్ ప్లాన్ చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన ఇద్దరూ పలు సినిమాలు చేశారు. అందులో బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఉన్నాయి. బాలకృష్ణ సినిమాల్లో కూడా ఇద్దరూ నటించారు. ఆ సినిమాలకు సంబంధించిన విషయాలు అన్నీ సరదాగా చర్చించే అవకాశం ఉంది. జయప్రద, జయసుధ కంటే ముందు ప్రభాస్, గోపీచంద్‌తో ఒక ఎపిసోడ్ షూటింగ్ చేయనున్నారు. 
   
బాలయ్యతో ప్రభాస్ & గోపీచంద్
ఇప్పటి వరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క... ఇప్పుడు వచ్చే గెస్టులు ఓ లెక్క... అనే విధంగా 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ను తీసుకు వస్తున్నారు. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ప్రభాస్, గోపీచంద్ కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటారు. ఎక్కువగా షోస్, ఈవెంట్స్ వంటి వాటికి అటెండ్ కారు. బాలకృష్ణ షో కోసం వాళ్ళిద్దర్నీ ఒప్పించారు. ఈ 11న ఆ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని తెలిసింది.


Also Read : ఇది కదా రాజమౌళి రేంజ్ - న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుల్లో అరుదైన ఘనత
  
'అన్‌స్టాపబుల్ 2' ఐదో ఎపిసోడ్‌లో ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు (D Suresh Babu), అల్లు అరవింద్ (Allu Aravind)తో పాటు దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, మరో దర్శకుడు కోదండరామిరెడ్డిని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. నిన్న (డిసెంబర్ 2న) ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది.  


ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్స్, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. రాజకీయ నాయకులు, సీనియర్లు వచ్చినప్పుడు షోను ఓ విధంగా నడుపుతున్న బాలకృష్ణ... యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్, అడివి శేష్ వంటి వారు వచ్చినప్పుడు పూర్తిగా బాలుడు అయిపోతున్నారు. యువ హీరోలతో కలిసి విపరీతంగా సందడి చేస్తున్నారు. బాలకృష్ణకు 'అన్‌స్టాపబుల్' కొత్త ఇమేజ్ తీసుకు వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. షో చూసి కొందరు ఆయనకు ఫ్యాన్స్ అవుతున్నారు.