తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి ( Ayyanna ) ఊరట లభించింది. ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల  పోలీసులు నమోదు చేసిన కేసులపై తదుపరి చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల నల్లజర్లలో అయ్యన్నపాత్రుడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ( NTR Statue ) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  అయ్యన్న పాత్రుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని ఓ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ( Nallajarla ) ఫిర్యాదు చేశారు. వెంటనే నాలుగు సెక్షన్ల కిందకేసు నమోదు చేసిన పోలీసులు నర్సీపట్నంలోని ఆయన ఇంటి వద్దకు వచ్చారు. 


బుధవారం ఉదయమే నర్సీపట్నంలోని ( Narsipatnam ) ఇంటి వద్దకు పోలీసులు వచ్చారు. అయితే అయ్యన్నపాత్రుడు అందుబాటులో లేరు. దాంతో ఆయన ఇంటికి 41ఏ నోటీసులు అంటించారు. ఓ సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు రావడంతో అయ్యన్నను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. నోటీసులు అంటించిన తర్వాత కూడా పోలీసులు వెళ్లకపోవడంతో నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయ్యన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని వేల మంది అయ్యన్న ఇంటి దగ్గర గుమికూడారు.


సాయంత్రానికి వారందర్నీ కంట్రోల్ చేయాడనికి అన్నట్లుగా సీఆర్పీఎఫ్ బలగాలను కూడా పోలీసు ఉన్నతాధికారులు పంపించారు. దీంతో ఓ వైపు బలగాలు.. మరోవైపు పోలీసులు మధ్య నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాత్రి ఏ క్షణమైనా అయ్యన్న పాత్రుడుని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఎంత రాత్రి అయినా టీడీపీ కార్యకర్తలు నర్సీపట్నంలోనే ఉన్నారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఉదయమే హైకోర్టులో అయ్యన్నపాత్రుడు తరపు లాయర్ పిటిషన్ వేశారు.పోలీసుల చర్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టారని వాదించారు. దీంతో ఈ కేసులో తదుపరి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. అయ్యన్ను అరెస్ట్ చేయాలన్న పోలీసుల ప్రయత్నాలకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడినట్లయింది. 


అయ్యన్నపాత్రుడిపై కేసులు నమోదవడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికి మూడు, నాలుగుసార్లు కేసులు నమోదు చేశారు. ఓ సారి అట్రాసిటీ కేసు.. నిర్బయ కేసు కూడా పెట్టారు. అవన్నీ తప్పుడు కేసులని అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించి  అరెస్ట్ నుంచి రక్షణ పొందారు. మరోసారి కేసుల నుంచిఅదే విధంగా రక్షణ  పొందారు.