ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆధిపత్య పోరు చివరకు అధికార పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు దాకా వెళ్తోంది. ప్రధానంగా 2018 తర్వాత జరిగిన పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు తలనొప్పిగా మారాయి. జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో వర్గ పోరు ఉనప్పటికీ వైరాలో మాత్రం వర్గపోరు కాస్తా మరింతగా ముదిరింది. తాజా, మాజీ ఎమ్మెల్యేల మద్య వైరం తీవ్రస్థాయికి చేరుకోవడం గమనార్హం. ఇది చివరకు అధికార పార్టీ నాయకులపై కేసులు పెట్టే వరకు వెళ్లడంతో ఇప్పుడు వైరా నియోజకవర్గంలోని వర్గవిబేదాలు జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 


2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ (TRS Party) అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాములునాయక్‌ విజయం సాదించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో వైరా నియోజకవర్గంలో మూడేళ్ల నుంచి రెండు వర్గాలుగా విడిపోయిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఆధిపత్య పోరులో పడ్డారు. తన వర్గానికి చెందిన కార్యకర్తలను కాపాడుకునేందుకు తరచూ మదన్‌లాల్‌ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తుండటంతో రెండు వర్గాలుగా విడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 


దాడులకు వెనకాడని వైనం..
వైరా నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు చివరకు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడేందుకు వెనుకంజ వేయడం లేదు. నియోజకవర్గంలోని జూలూరుపాడులో వినాయక చవితి సందర్భంగా రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా రెండు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ సందర్భంగా తాజా, మాజీ ఎమ్మెల్యేల వర్గాలు విడివిడిగా ఉండటంతో వీరిని క్యాంప్‌కు చేర్చేందుకు పార్టీ పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మదన్‌లాల్‌ వర్గానికి చెందిన కార్యకర్తలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని పిర్యాదు చేశారు. 
అధికార పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు..
కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు చెందిన కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు వేల బైక్‌లతో ఈ ర్యాలీ జరగడంతో ఎమ్మెల్యే రాములు నాయక్‌ అలర్ట్‌ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులను అదుపు చేయడం కోసం చివరకు కేసులు పెట్టించినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ నిబందనల పేరుతో ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలపై ఇలా కేసులు నమోదు కావడంతో భవిష్యత్‌లో రెండు వర్గాల ఆదిపత్యపోరు ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఈ సమస్యకు పార్టీ పెద్దలు ఎలా చెక్‌ పెడతారనేది వేచి చూడాల్సిందే.