తెలంగాణ సీఎం కేసీఆర్ ( KCR ) శుక్రవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఆయన గురువారం వెళ్తారని అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఒక రోజు వాయిదా పడింది. బీజేపీకి (BJP )  వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతల్ని కూడగట్టేందుకు కేసీఆర్ ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అంశం కోసమే ఆయన చర్చించేందుకు ఢిల్లీకి ( Delhi ) వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు ఓ ప్రతినిధి బృందం వెళ్లనుంది. ఇప్పటికే అక్కడ ఎవరెవర్ని కలవాలో ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా భావిస్తున్నారు. కేసీఆర్ పర్యటనను మాజీ ఎంపీ ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. 


కేసీఆర్‌తో పాటు ఎంపీలు.. ( TRS MPs )  కొంత మంది మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల కేసీఆర్ రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఎవరెవర్ని కలిశారో స్పష్టత లేదు. కొన్ని రహస్య సమావేశాల తర్వాత తిరిగి వచ్చారు. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లుగా  ప్రచారం జరిగింది. ఈ సారి మాత్రం ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు ప్రశాంత్ కిషోర్‌తోనూ ( PK ) సమావేశం అయ్యే అవకాశం ఉంది. వచ్చే రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి ప్రత్యేకంగా ఓ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయని అందులో భాగంగా కేసీఆర్ లేదా నితీష్ కుమార్‌లను అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచన చేస్తున్నాయన్న ప్రచారం ఢిల్లీలో ఎక్కువగా ఉంది. 


ఈ అంశంపై ఢిల్లీలో కసరత్తు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ వర్గాలు ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. అయితే రాష్ట్రపతి ( President Election ) ఎన్నికలు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయాడానికి ఓ అవకాశం కలిగిస్తుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress ) లేకుండా కూటమి ఉండదన్న అభిప్రాయాన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కూటమిగా మారి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ వారికి మద్దతిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కోణంలో కేసీఆర్ రాజకీయం చేసే అవకాశం ఉంది. 


అధికారికంగా కాంగ్రెస్ కూటమిలో లేకపోయినా పరోక్షంగా కాంగ్రెస్ మద్దతు కూటమికి కేసీఆర్ తన వంతు  ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లానని ప్రకటించేశారు. ఆ తర్వాత తొలి సారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన జాతీయ రాజకీయాలను కాస్తయినా మార్చేఅవకాశం ఉంది. అదే సమయంలో ఢిల్లీలో నిర్మాణం అవుతున్న పార్టీ ఆఫీసును ( TRS Party Office ) కూడా కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది.