KA Paul First Candidate:  తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని గట్టి నమ్మకంతో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ దూకుడు మీద ఉన్నారు. తొలి అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. అమరవీరుడు కాసోజు  శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారికి తొలి ఎమ్మెల్యే సీటు ప్రకటించేసినట్లుగా కేఏ పాల్ తెలిపారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాగానే..  తెలంగాణ అమరవీరుల కుటుంబాల అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత గృహ వసతి  సత్వరమే కల్పిస్తామని ప్రకటించారు.


కాసోజు వెంకటాచారికి ప్రజాశాంతి పార్టీ తొలి టిక్కెట్ !


తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని..   తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటాచారి  ప్రకటించారు. త్యాగాలు చేసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మేలు చేయట్లేదు అని వాళ్ళ బాధలు వర్ణనాతీతమని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అమరవీరులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు.తెలంగాణ అమరవీరులు అంతా ఒక్కటి అవుతున్నారని, తమకు జరుగుతున్న   అన్యాయం ను గుర్తిస్తున్నారని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు, రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రతి మండలం, అన్ని గ్రామాలకు నేను తిరిగి చైతన్యవంతం చేస్తానని చెప్పారు.


అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానన్న కేఏ పాల్ !


ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే ఏ పాల్ తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు సత్వర  న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, అందుకే తాను ప్రజాశాంతి పార్టీ లో చేరానని వెంకటాచారి ప్రకటించారు.  ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కాసోజు శ్రీకాంతాచారి ఫోటో పెట్టాలని ఆయన  డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఈ కేసీఆర్ వాడుకొని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నాడని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారికి మేలు చేస్తున్నారని విమర్శించారు. 


 






తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా కేఏపాల్ అమరవీరులకు నివాళి అర్పించారు. పలువురు ఇతర పార్టీల నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు.