Kottapalli Subbarayudu Suspension YSRCP : మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల కిందట నర్సాపురం ను జిల్లా కేంద్రం చేయాలని ఆయన చేపట్టిన నిరసనలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై విమర్శలు చేశారు. ఆయనను గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. ఈ అంశం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా జిల్లా సాధన ఉద్యమం చేసింది. ఎమ్మెల్యే ప్రసాదరాజుపై విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ చెప్పుతో కొట్టుకున్న సుబ్బారాయుడు
అప్పట్లోనే కొత్తపల్లి సుబ్బారాయుడిపై వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం నిర్ణయించేది ఎమ్మెల్యే ప్రసాదరాజు కాదని ఆయనను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారని ప్రశ్నించారు. అప్పట్నుంచి ఆయనను పార్టీలో దూరం పెడుతున్నారు. అయితే ఇటీవల నర్సాపురం నియోజకవర్గంలో ఆయన దూకుడు పెంచారు. సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ అన్నది ఆయన చెప్పడం లేదు. దీంతో ఇతర పార్టీలతో ఆయన టచ్‌లో ఉన్నారేమోనని వైఎస్ఆర్‌సీపీ నాయకులు అనుమానంలో పడ్డారు.
అనేక పార్టీలు మారిన సుబ్బారాయుడు
కొత్తపల్లి సుబ్బారాయుడు మొదటగా తెలుగుదేశం పార్టీ నేత. ఆ పార్టీలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. జగన్ కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కొంత మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్‌సీపీలో చేరి రాజీనామాలు చేశారు. అలా వచ్చిన ఉపఎన్నికల్లో కొత్తపల్లి సుబ్బారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బండారు మాధవనాయుడు చేతిలో ఓడిపోయారు. మళ్లీ ఆయన టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కాపు కార్పొరేషన్ పదవి ఇచ్చారు. అయితే నర్సాపురం టిక్కెట్ ఇవ్వలేదని మళ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీలో చేరారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచైనా పోటీ చేయాలని నిర్ణయం
వైఎస్ఆర్‌సీపీలోనూ ఆయనకు టిక్కెట్ దక్కలేదు. అంతే కాదు కనీసం కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు. ఆయనను పట్టించుకోకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఇలా ఉంటే రాజకీయ జీవితం దెబ్బ తింటుందని అనుకున్నారేమో కానీ వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. ఇప్పటికి ఆయన టీడీపీ , కాంగ్రెస్ , వైఎస్ఆర్‌సీపీలను చూశారు కాబట్టి.. తర్వాత జనసేనలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.