Vijayasaireedy Twitter Language : తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అని రాజకీయ నేతలు హద్దులు దాటిపోతున్నారు. ఏపీ రాజకీయ నేతలు అయితే... ఇలా కూడా విమర్శించుకోవచ్చా అని రోజు రోజుకూ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తున్నారు. రాజకీయ నాయకుల భాష ఇంత కంటే ఎక్కువ దిగజారరులే అనుకున్న ప్రతీ సారి మరింతగా దిగజారిపోతోంది. ప్రెస్‌మీట్లలో మీడియా ముందు మాట్లాడే భాషలో కొడాలి నాని, వల్లభనేని వంశీ , అంబటి రాంబాబు వంటి వారు ప్రత్యేకత సాధించగా... సోషల్ మీడియాలో వారి స్థాయిలో ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన అయ్యన్నపాత్రుడు గురించి చేసిన ట్వీట్లు ఇవి.
రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం అనేది సహజం. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను విమర్శలు అనడం కన్నా తిట్లు అనడమే కరెక్ట్‌గా ఉంటుంది. ఇలాంటి తిట్లు ఎవరూ బహిరంగంగా తిట్టుకోరు.
విజయసాయిరెడ్డి విద్యాధికుడు. ఆయన అందర్నీ గౌరవించి.. గౌరవం పుచ్చుకుంటారని చెబుతారు. అయితే ఇదంతా ఆయన రాజకీయాల్లోకి రాక ముందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ వదిలేయాలనే ఓ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మారేమో కానీ.. ఆయన మాట తీరు మారిపోయింది. అది రాను రాను దిగజారిపోతూ వస్తోంది. చివరికి.. ఆయన చేస్తున్న ట్వీట్ల గురించి ఫీడ్ బ్యాక్ తెలుసుకోండి అని ఇతరులు సలహాలివ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
అనడానికి మాటలే. అందరికీ నోళ్లుంటాయి. ఎవరైనా ఒక తిట్టు తిడితే ఎదుటి వాళ్లు నాలుగు తిడతారు. ఆ లాంగ్వేజ్ఒకరి సొత్తు కాదు. విజయసాయిరెడ్డి అలా తిట్లను ట్వీట్లుగా పెడితే అంత కంటే దారుణంగా ఆయనను ఆయన కుటుంబసభ్యులను కూడా విమర్శిస్తూ సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు పోస్టులు పెడుతూనే ఉన్నారు.
ఇలా ఒకరినొకరు దారుణంగా విమర్శించుకుంటున్నట్లుగా తిట్టుకోవడం వల్ల... ఒకరిపై ఒకరు అసహ్యం పెంచుకోవడం.. ఇలాంటి భాష మాట్లాడతారా అని ప్రజల్లోనూ ఆశ్చర్యం కలిగించడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రజల్లో విలువ పోగొట్టుకోవడం తప్ప . కానీ ఈ విషయాన్ని రాజకీయ నేతలు గుర్తించలేకపోతున్నారు.