TS Congress Sentiment : రాజకీయాల్లో గెలుపు సూత్రాలు ఎప్పుడూ సామాజిక సమీకరణాలు లేకపోతే ఇచ్చే హామీల మీద ఆధారపడి ఉండవు. ఒక భావోద్వేగం రావాలి. ఓ సెంటిమెంట్ ప్రజల్లో వ్యాపిస్తే ఆటోమేటిక్‌గా .. ఎన్ని ప్రతి బంధకాలు ఎదురైనా గెలుపు తీరాలకు చేరుస్తుంది. ఓట్ల వర్షం కురిపిస్తుంది. ఆ భావోద్వేగం ఎలా వస్తుంది ? ఇది చాలా క్లిష్టమైన విషయం.  చాలా రాజకీయ పార్టీలు ఇరప్పుడు దీనిపైనే కసరత్తు చేస్తున్నాయి. ప్రజల్లో ఓ భావోద్వేగం తేవడంలో సక్సెస్ అయిన పార్టీ.. సక్సెస్ అవుతుంది. లేకపోతే లేదు. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఫలితాలను భావోద్వేగాలే ప్రభావితం చేస్తున్నాయి. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ఈ సారి తెలంగాణ సెంటిమెంట్‌నే ఎంచుకుంది. 


ప్రతీ రాజకీయ పార్టీకి ఓ సెంటిమెంట్ !


రాజకీయాల్లో  సెంటిమెంట్ వర్కవుట్ అయితే తిరుగులేని విజయాలు వస్తాయి. నాడు ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం నినాదం ఇస్తే ప్రజలందరూ భావోద్వేగంతో స్పందించారు. తర్వాత కేసీఆర్ జై తెలంగాణ అని నినదిస్తే టీఆర్ఎస్ తిరుగులేని పార్టీ అయింది. ఇక హిందూ వాదంతో బీజేపీ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రాజకీయ పార్టీలు ... ఇతర పార్టీలపై విద్వేష సెంటిమెంట్‌ను రగిల్చి విజయాలు అందుకున్న చరిత్ర కూడా ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెట్టడం ద్వారా విజయాలు అందుకుంటున్న పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు గెలుపు లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఒక్కో సెంటిమెంట్‌ను అందుకుంటున్నాయి. ఇప్పటి వరకూ పెద్దగా సెంటిమెంటల్ రాజకీయాలు చేయని.. చేసినా వర్కవుట్ కానీ పార్టీ కాంగ్రెస్సే. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..  తమదైన సెటిమెంట్‌ అస్త్రాన్ని ప్రజలపై వదులుతున్నారు. 


తెలంగాణ సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్నరేవంత్ రెడ్డి !


తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ  .. ఆ సెంటిమెంట్ ను వర్కవుట్ చేసుకోవడంలో విఫలమయింది. అది రెండు సార్లు జరిగింది. ఈ సారి మాత్రంపూర్తి స్థాయిలో సక్సెస్ కావాలనుకుంటోంది. అందుకే తెలంగాణ సెంటిమెంట్‌ను రేవంత్ రెడ్ిడ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు జాతీయ జెండాతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందిస్తామని..  తాము అధికారంలోకి వస్తే ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.  అలాగే తెలంగాణలో సబ్బండ వర్ణాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని  కచెబుతున్నారు.  టీఆర్‌ఎస్‌ ను పోలి ఉన్నట్టుగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం టీఎస్ అని తీసుకొచ్చారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని సవరించి టీజీ చేస్తామని కూడా ప్రకటించారు. రేవంత్ ప్రతిపాదనలపై తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న వారిలో సానుకూలత వ్యక్తమవుతోంది. 


తెలంగాణ సెంటిమెంట్ చాంపియన్ కేసీఆర్ - కానీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్ !


నిజానికి తెలంగాణ సెంటిమెంట్ అంటే అందరికీ గుర్తు వచ్చేది కేసీఆరే. ఎందుకంటే ఆయనే అందులో ఛాంపియన్. తెలంగాణ రాష్ట్రా ఉద్యమాన్ని చేపట్టి.. అందరి మనసుల్లో ఉద్వేగాన్ని నింపి అనుకున్నది సాధించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి.. భారతీయ సెంటిమెంట్‌ను అందుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కొత్త పార్టీ పెడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తెలంగాణ సెంటిమెంట్ బ్యాటన్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయడం కూడా ప్రారంభించారు. ముందు ముందు ఈ విషయంలో మరికొన్ని ప్రత్యేకమైన తెలంగాణ వాదం డిమాండ్లను రేవంత్ తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. 


రాజకీయాల్లో ప్రజల్ని భావోద్వేగానికి గురి చేయడం ఇప్పుడు చాలా సులువు . ఓ పకడ్బందీ నినాదం ఉంటే చాలు.. వర్కవుట్ అయిపోతుంది. కానీ ఇది పులి మీద స్వారీ లాంటిది. తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. కానీ రాజకీయ పార్టీల్లో ఉన్నవారికి ఇది తప్పదు.  గెలుపు బాధ్యత  భుజాన వేసుకున్నవారు విజయమో.. వీర స్వర్గమో తేల్చుకోవాలి కాబట్టి సిద్ధమవుతున్నారు.