Telugu States BJP :  తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు సొంత పార్టీలో ఉక్కపోత తప్పడంలేదు. వారిని తప్పించాలని సొంత పార్టీలో బలమైన వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికి అయితే బీజేపీ హైకమాండ్ వారిపైనే నమ్మకం పెట్టుకుంది.కానీ పార్టీ నేతలంతా ఏకమైనా వారొద్దంటే మార్చక తప్పని పరిస్థితి ఏర్పడుతుందేమో కానీ.. పరిస్థితి మాత్రం సాఫీగా లేదు. ఏపీలో సోము వీర్రాజు, తెలంగాణలో బండి సంజయ్ ఇద్దరూ ఏకపక్ష ధరోణితో వెళ్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో కంటే తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటంతో అక్కడ ఇంకా ఎక్కువగా  కుమ్ములాటలు ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితిని హైకమాండ్ ఎలా చక్కదిద్దుతుందన్న ప్రశ్న వినిపిస్తోంది. 


బండి సంజయ్‌పై బయటపడుతున్న అసంతృప్తి ! 


తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య అంతర్గతపోరు రోజు రోజుకు తీవ్రమవుతోంది.  తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏకంగా అమిత్‌ షా హెచ్చరించినా మారలేదు.  ముఖ్యనేతలంతా ఐకమత్యంతో ఉంటూ సమన్వయంతో ముందుకుసాగాలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించిన గంటల వ్యవథిలోనే బీజేపీ నేతల మధ్య విభేదాలు బహిర్గతం కావడం పార్టీ అధిష్టానాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పవర్‌ సెంటర్‌ కాదని, అది నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన పదవి అని బీజేపీలో బండి సంజయ్‌ తీరుపై నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చాలా స్పష్టంగా ధర్మపురి అర్వింద్ తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆయన వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. 


సంజయ్‌కు వ్యతిరేకంగా పెరుగుతున్న స్వరాలు ! 


బండి సంజయ్‌ ఒంటెద్దు పోకడలు, సమన్వయలోపంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు.  బండి సంజయ్‌ ఎంతసేపు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలపై ప్రశంసలు కురిపిస్తూ వారి మెప్పు కోసమే ఆరాటపడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, రాష్ట్ర ముఖ్య నాయకులతో మాత్రం ఆయన కలిసి ముందుకుసాగటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు మొఖ్యనేతలు కూడా బండి నాయకత్వ తీరు, ఆయన నిర్ణయాలు తీసుకుంటున్న వైనంపై చాలాకాలంగా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ మాజీఅధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్‌ కూడా బండి సంజయ్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  తెలంగాణ బీజేపీలో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన సీనియర్‌ నేతలే ఉన్నారు. వీరిలో మాజీ ఎంపీలు వివేక్‌ వెంకటస్వామి, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు తదితరులు కూడా పలుమార్లు బండి సంజయ్‌ తీరుపై అధిష్టానం వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. సంజయ్‌ను మార్చాలని కోరుతున్నారు.  కానీ హైకమాండ్ మాత్రం.. ఇప్పటి వరకూ సంజయ్  పైనే హైకమాండ్ నమ్మకం పెట్టుకుంది. కానీ ఈ అసమ్మతి పెరిగితే ఏం చేస్తుందనేది కీలకం. 


ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుదీ అదే పరిస్థితి !


ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపైనా ఆ పార్టీలో అసంతృప్తి ఉంది. సోము వీర్రాజును కారణంగానే చూపిస్తూ కన్నా పార్టీ మారిపోయారు. బీజేపలో ఉన్న మెజార్టీ సీనియర్ నేతలు సోము వీర్రాజును తప్పించాలంటున్నారు.  భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణకు   ప్రాదాన్యత ఉంటుంది   పార్టీ లైన్ దాటి ఇష్టాను సారంగా వ్యవహరిస్తే వేటు వేస్తారు.  కానీ సోమును వ్యతిరేకించేవారు ఎక్కువగా ఉండటంతో చర్యలు తీసుకోలేకపోతున్నారు.  కన్నా  రాజీనామా చేసిన తర్వాత ఏపీ బీజేపీ సీనియర్లు కొందరు  అగ్ర నాయకులను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారికి అపాయింట్ మెంట్ లభించలేదని చెబుతున్నారు. విభేదాలు ఉన్నా,సమస్యలు ఉన్నా రాష్ట్ర నాయకత్వం వద్ద కాని లేదా, క్రమశిక్షణా సంఘం వద్ద కాని తేల్చుకోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు. దీంతో చాలా మంది అసంతృప్తికి గురయ్యారు. ప్రస్తుతం ఏపీబీజేపీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. 


తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మంచి ఫలితాలు వస్తాయని ఆశ పడుతోంది. దానికి తగ్గట్లుగా  కష్టపడాలని నేతలకు హితబోధ చేస్తోంది. కానీ నేతల మధ్య పూర్తి  స్థాయిలో సమన్వయ లోపం కనిపిస్తోంది. దీన్ని హైకమాండ్ సరిదిద్దడానికి సమయం తీసుకుంటోంది. ఎంత ఆలస్యం అయితే బీజేపీకి అంత నష్టం జరుగుతుంది.