నాందేడ్‌ సభ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ మరో సభను మరాఠా గడ్డమీద తలపెట్టాలని నిర్ణయించింది. నాందేడ్ సభ సక్సెస్ కావడంతో అదే ఊపులో మరో సభకు ప్లాన్ చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌. ఈసారి కంధర్ లోహ ఏరియాలో సభ ఉంటుందని పార్టీ తెలిపింది. ఈ నెల 26న డేట్ ఫిక్స్ చేశారు. ఈసారి కూడా నాందేడ్ జిల్లాలోనే ప్లాన్ చేశారు. కంధర్ లోహ అసెంబ్లీ నియోజకవర్గంలో సభ ఉంటుందని, ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని పార్టీ తెలిపింది.


జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది! ఖమ్మం డిక్లరేషన్ తర్వాత మొదటిసారిగా తెలంగాణ వెలుపల మరాఠా గడ్డమీద శంఖారావం పూరించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్! ఫిబ్రవరి మొదటివారంలో జరిగిన ఈ మీటింగ్‌ని పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. రెండో  మీటింగ్‌ని కూడా సరిహద్ధున ఉన్న మరాఠా జిల్లాలోనే పెట్టాలని నిర్ణయించారు. మరికొంతమంది మరాఠా నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకే ఈ బహిరంగసభను తలపెట్టారని తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలోనే రెండో సభను జరపాలనే నిర్ణయం వెనుక కేసీఆర్ వ్యూహంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.    


ఈ క్రమంలో మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు  వచ్చారు.  మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశాడు. నాగనాథ్‌- భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం అశోక్ చౌహాన్ మీద వెయ్యి వోట్ల  తేడాతో  ఓడిపోయాడు. మరో ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, మహారాష్ట్ర ఎన్సీపి యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపి అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, ఎన్సీపి లోహ అధ్యక్షుడు సుభాష్ వాకోరే, ఎన్సీపి కంధర్ నియోజకవర్గ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు అడ్వొకేట్ విజయ్ ధోండగే, ఎన్సీపి యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వాప్నిల్ ఖీరే  తదితరులు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ  బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.


నాందేడ్ సభకంటే ముందు జనవరి నెలలో ఒడిషా నేతలు బస్సుల్లో తరలివచ్చి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌తో పాటు ఆయన కుమారుడు శిశిర్‌ గమాంగ్‌, భార్య హేమ గమాంగ్‌ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. వారితో పాటు ఒడిషా మాజీమంత్రి జయరాం పాంగి, మాజీ ఎమ్మెల్యే నబిన్ నందా సహా మొత్తం 12 మంది మాజీ శాసనసభ్యులు, నలుగురు మాజీ ఎంపీలు పార్టీలో చేరారు. మహారాష్ట్ర సహా, ఉత్తర భారత ప్రజలు తమ పార్టీ విధానాలను అర్థం చేసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.