Three Capitals :  మూడు రాజధానులను పెట్టబోతున్నానని ఏపీ సీఎం జగన్ ప్రకటించి వెయ్యి రోజులు అయింది. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు ముందుకేయలేకపోయారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నిర్మించాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది.  అసాధారణంగా రిట్ ఆఫ్ మాండమస్ ... తీర్పు ఇచ్చింది.  అంటే ప్రభుత్వం ఏ విధంగానూ ఇక మూడు రాజధానులు చేయలేదు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఆ తీర్పునూ ఉల్లంఘిస్తామని నిర్మోహమాటంగా చెబుతోంది. మూడు రాజధానులు తధ్యమని వాదిస్తోంది. ఎలా చేసినా అది తీర్పు ఉల్లంఘన.. రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఇలా ఎందుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది ? 


వెయ్యి రోజుల కిందట..  మూడు రాజధానుల వివాదం !
 
వెయ్యి రోజుల కిందట...ఓ  డిసెంబర్ 17న సీఎం అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయని... అందుకే ఏపీలోనూ పెడుతున్నామని ప్రకటించారు.  అలా ప్రకటించడం ఆలస్యం.. ఇలా వెళ్లిపోదామని  ప్రభుత్వం అనుకుంది.  ఎప్పటికప్పుడు ముహుర్తాలు ఖరారు చేశారు. కానీ..  వెళ్లలేకపోయారు.  మధ్యలో వచ్చిన పాలనాపరమైన.. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించలేకపోయారు. అసలు రాజధాని ఎక్కడ ఉండాలన్నది సమస్యే కాదని.. ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అనే వాదన తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకూ సీఎం విశాఖ వెళ్లలేకపోయారు.  ఏపీ రాజధాని ఏది అనే ఓ సస్పెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. 


 ఎన్నికల్లో గెలిచే వరకూ అమరావతికే మద్దతు.. ఆ తర్వాతే మాట మార్చిన వైఎస్ఆర్‌సీపీ ! 


అమరావతిని గతంలో వైఎస్ఆర్‌సీపీ సమర్థించింది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలంతా అమరావతే రాజధాని అని.. అన్ని ప్రాంతాల్లో చెప్పారు.  అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు..ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.  అమరావతే రాజధాని అని కుండబద్దలు కొట్టిన నేతలు.. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతికి మద్దతు తెలిపిన వీడియోలు..ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సోషల్ మీడియాలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి. అయితే అమరావతి రాజధానిగా పనికి రాదని రకరకాల కారణాలు చెప్పారు కానీ ఏదీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. కేవలం ఆరోపణలుగానే ఉన్నాయి. దీంతో అమరావతి విషయంలో జగన్ మాట మార్చారని .. ఏపీలో రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు నెలకొల్పారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 


మూడున్నరేళ్ల నుంచి అమరావతి నుంచే పాలన..!  
 
గత  ప్రభుత్వానికి అమరావతి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవ్వడానికి, రైతులనుండి భూమి సేకరించడానికి రెండు సంవత్సరాలు పడట్టింది. రాజధానిపై గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసులు వేశారు. దీంతో సమగ్రమయిన ఎత్తిపోతల పధకాన్ని కొండవీటి వాగుకు నిర్మించాకే రాజధాని విషయంలో ముందుకు వెళ్ళాలని హరిత ట్రిబ్యూనల్ ఆదేశించడంతో మరో రెండు సంవత్సరాలు పాటు రాజధాని నిర్మాణం నత్తనడకన సాగింది. ఎత్తిపోతల పధకాన్ని నిర్మించిన తర్వాత రాజధాని పనులు వేగం పుంజుకున్నాయి. పలు బహుళ అంతస్ధుల భవనాలు నిర్మాణం వేగంగా సాగింది. 8నుండి 10 నెలలు కాలంలోనే చాలా భవనాలు 80నుండ 90 ‎శాతం పూర్తయ్యాయి.  ప్రైవేటు వర్సిటీలు ...ప్రభుత్వ భవనాలు...  పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఏ ఇబ్బంది లేకుండా మూడున్నరేళ్ల నుంచి అమరావతి నుంచే పాలన సాగుతోంది. 
 
ఎదురు దెబ్బల నుంచి ప్రభుత్వం ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదు ?


అమరావతి విషయంలో ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా మొండితనంతో  వ్యవహరిస్తూనే ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. న్యాయపరంగా కూడా దారులు మూసుకుపోయాయి. చట్ట పరంగా చేయలేమని తేలిపోయింది.  రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్‌సీపీ తప్ప.. ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ.. ఇతర సంఘాలు కానీ మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడం లేదు. అసలు ఆ కాన్సెప్టే సాధ్యం కాదని చాలా మంది ఉదాహరణలు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఓ వైపు రాజ్యాంగం.. మరో వైపు ప్రభుత్వ పట్టుదల .. ఏపీ రాజధాని విషయంలో ఉన్నాయి. చివరికి ఫలితం ఎటు తేలుతుందో ?