KCR National Party :  తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. జాతీయ పార్టీ పెట్టడం ఖాయమని టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ముందు అనేక ప్రతికూలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఉత్తరాది ప్రజలకు తెలియకపోవడం దగ్గర్నుంచి  తెలంగాణ పేరుతో ప్రాంతీయ ఉద్యమం నడిపి ఇప్పుడు దేశం మొత్తం రాజకీయం చేస్తాననే భావజాలం వరకూ అనేక ప్రతికూలతలు ఉన్నాయి. అయినా కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. దీనికి కారణం ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకం అని అనుకోవచ్చు. 


రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థులకు అందని నేత కేసీఆర్ !


 తెలంగాణలో తిరుగులేని నేతగా ఉన్న కేసీఆర్ ప్రతి అడుగులోనూ రాజకీయం ఉంటుంది. అది ప్రత్యర్థులకు అందని రాజకీయం. అందుకే తెలంగాణ రాష్ట్రాన్నిసాధించారు.  కానీ ఓ ప్రాంతీయ పార్టీ నేత . అదీ కూడా ప్రాంతీయ ఉద్యమాన్ని నిర్వహించి అధికారంలోకి వచ్చిన నేత. తాను జాతీయ రాజకీయాలు.. అని అంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికే టీఆర్ఎస్ పేరుతో కాకుండా జాతీయ పార్టీని ఆయన పెడుతున్నారు. అంటే తెలంగాణ ఇమేజ్‌ను వదిలి నేషనల్ లుక్ కోసం ప్రయత్నిస్తున్నారు. 


తెలంగాణ మోడల్ అభివృద్ధి పై నమ్మకం ! 


తెలంగాణ ఎనిమిదేళ్లలో అద్భుతంగా ప్రగతి సాధించిందని కేసీఆర్ నమ్ముతున్నారు.  ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన విజయాల్ని దేశం ముందు పెడుతున్నారు. కేసీఆర్ తాను చేసి చూపిస్తానని వారికి తెలంగాణ అభివృద్ధి నమూనాను వారి ముందు ఆవిష్కరిస్తున్నారు.  స్వయంగా ఎవరూ చెప్పరు కాబట్టి...  ప్రకటనల రూపంలో తెలంగాణ అభివృద్దిని ఉత్తరాది ప్రజల ముందు ఉంచుతున్నారు. జాతీయ మీడియాలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ .. తెలంగాణ పాలన ప్రయోజనాలు అభివృద్ధే కనిపిస్తోంది. 


రైతు సెంటిమెంట్‌ను బలంగా ప్రయోగించే ప్లాన్ ! 


రైతులందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ... ఆయన గట్టి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అమలు చేస్తున్నారు కూడా. ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇచ్చారు. తెలంగాణలో రైతులకు తాము చేస్తున్న మేలు గురించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులను ప్రగతి భవన్‌కు పిలిపించి.. తెలంగాణలో రైతులకు చేస్తున్న మేలును వివరించారు. అందరం కలిసి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ పిలుపు రైతు సంఘాల నేతల్ని ఆకర్షించింది. వారంతా....కేసీఆర్ నేతృత్వంలో రైతు పార్టీగా ఏర్పడి.. మోదీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారని అనుకోవచ్చు. రైతు నేతలంతా చట్టసభల్లో ఉండాలని కేసీఆర్ అన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో రైతు నేతలను ముందు పెట్టి.. రైతు సెంటిమెంట్‌తో.. రైతు పార్టీని కేసీఆర్ లాంఛ్ చేయబోతున్నారని అర్థం చేసుకోవచ్చు.
 
 ప్రత్యేక పార్టీతో ముందుకెళ్లడం ! 


ప్రాంతీయ పార్టీ నేతగా తాను ఇతర పార్టీలతో కూటమి కట్టి మాత్రమే రాజకీయాలు చేయగలనని కేసీఆర్ అనుకున్నారు. కానీ తన ఆలోచనలను చివరికి తానే మార్చుకున్నారు.జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలంటే.. ఈ కూటమి రాజకీయాలతో కుస్తీ పడటం కంటే.. తనదైన ప్రత్యేక పార్టీతో ముందుకెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.  తన ఆలోచనలను .. ప్రజల్లోకి పంపుతున్నారు. ఇటీవల నిజామాబాద్ సభలో .. తాము వస్తాం.. దేశం అంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చేసిన ప్రకటనపై ఉత్తరాదిలోనూ విస్తృత చర్చ జరిగింది.  
 
కేసీఆర్ ఢీకొట్టబోతున్నది నరేంద్రమోదీని.  ఖచ్చితంగా ఈ పోరాటంలో అడ్వాంటేజ్ మోదీ వైపే ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ కేసీఆర్ రాజకీయాలను మాత్రం తక్కువ అంచనా వేయలేం.  జాతీయ రాజకీయాల్లో గతంలో కేంద్ర ప్రభుత్వాల్ని మార్చగలిగేలా...  ఏర్పాటు చేయగలిగేలా చక్రం తిప్పిన నేతలు ఉన్నారు కానీ... నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్నే లక్ష్యంగా చేసుకున్న తెలుగు నేతలెవరూ లేరు. ఇప్పుడు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.