YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లకు చేరింది.  ఈ సందర్భంగా కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించారు షర్మిల.  పైలాన్ ఆవిష్కరణ లో ముఖ్య అతిథిగా వైఎస్ విజయమ్మ  హాజరయ్యారు.  మహానేత వైఎస్సార్‌ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు వైఎస్‌ విజయమ్మ. ‘‘వైఎస్సార్‌ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతం వైఎస్సార్‌. వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అంటూ అక్కడి కార్యక్రమానికి హాజరైన ప్రజలను, వైఎస్సార్‌టీపీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్‌ విజయమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. 



బంగారు తెలంగాణ కోసమే షర్మిల అడుగులు వేస్తోందని, అందుకు తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదం కావాలని ఆకాక్షించారు వైఎస్‌ విజయమ్మ. ఇదిలా ఉంటే.. 148 రోజుల్లో 2వేల కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పూర్తి చేసుకున్నారు వైఎస్‌ షర్మిల.  గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి ప్రారంభం అయిన ప్రజా ప్రస్థానం ప్రారంభమయింది. మధ్యలో కరోనా కారణంగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా...  మరోసారి అమెరికా పర్యటన కారణంగా విరామం ఇచ్చారు. ఆ తర్వాత నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం,నల్గొండ జిల్లాలను ముగించుకొని మహబూబ్ నగర్ లో పాదయాత్ర చేస్తున్నారు.  పాలమూరు జిల్లాలో ఇప్పటికే 11 నియోజక వర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. గ్రేటర్ మినహా అన్ని జిల్లాలనూ షర్మిల కవర్ చేస్తారు. 



వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళితే, ఆయనకు అండగా నిలిచారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతల్ని భుజానికెత్తుకుని, తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు.దేశ రాజకీయాల్లో వైఎస్ షర్మిల రికార్డుని ఎవరూ బ్రేక్ చేయలేరు పాదయాత్రకు సంబంధించి. ఇంతవరకు ఏ మహిళా రాజకీయ నాయకురాలు కూడా ఇంతటి సాహసం చేయలేదు మరి. తెలంగాణలో వైఎస్సార్ పేరుతోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం తీసుకురావాలన్న లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నారు.   


ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలపై షర్మిల ఘాటుగా విరుచుకుపడుతున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డిని వీధికుక్కతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై నిరంజన్ రెడ్డి కూడా స్పందించారు.  సీఎం కేసీఆర్‌పైనా ఆయన ఘాటు భాషను ప్రయోగిస్తున్నారు. పాదయాత్రను పూర్తి చేసి రాజన్న బిడ్డంగా తెలంగాణలో .. రాజన్న రాజ్యం తెచ్చేలా ప్రజల్ని ఒప్పిస్తానని ఆమె నమ్మకంతో ఉన్నారు.