తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...ప్రతిపక్షాలకు ఊహించని ఝలక్ ఇచ్చారు. ఒకేసారి 115మంది అభ్యర్థులను ప్రకటించారు. మూడోసారి గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అసంతృప్తులు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏడు చోట్ల కొత్తవారికి సీటిచ్చినా... పెద్దగా గొడవలు లేకుండా చూసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేలకు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చేది మన ప్రభుత్వమేనని... ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. తాండూర్ టికెట్ ను పైలెట్ రోహిత్ రెడ్డికి కేటాయించారు. అదే టికెట్ పై ఆశలు పెట్టుకున్న పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించారు. ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు.
కేసీఆర్ లాగా కాంగ్రెస్, బీజేపీ నేతలు సీట్లు కేటాయించడం అంత ఈజీ కాదు. హస్తం పార్టీలో టికెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలా చోట్ల ఒక సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఒకరి సీటిస్తే మరో నేతకు కోపం వస్తుంది. పార్టీ కార్యాలయాల్లో రచ్చరచ్చ చేస్తారు. పీసీసీకి వ్యతిరేకంగా నిరసనకు దిగుతారు. తమ వర్గానికి రాకుండా అడ్డుకున్నారంటూ...పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటారు.
కేసీఆర్ మాత్రం 115 మందిని ఒకేసారి ప్రకటించి...శత్రువులపై పైచేయి సాధించారు. కాంగ్రెస్, బీజేపీలను ఆత్మరక్షణలో పడేశారు. సిసలైన రాజకీయ నాయకుడని మరోసారి నిరూపించుకున్నారు. పార్టీలో అసంతృప్తులు లేకుండా వ్యూహాత్మకంగా వ్యహరించారు. ఇదిగో తమ రేసు గుర్రాలంటూ... ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. సై సవాల్ అంటూ బరి గీశారు.
కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్ కోసం సీటును త్యాగం చేసారు ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్దన్. సీట్ల ప్రకటన ముందు గంప గోవర్దన్ తో చర్చించిన తర్వాతే...కేసీఆర్ కామారెడ్డిని బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓటమి పాలవడంతో... వ్యూహాత్మకంగా అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ చేయని సాహాసాన్ని చేసారు. కేవలం నాలుగు చోట్ల పెండింగ్ పెట్టారు. ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే కొత్త వారికి అవకాశం కల్పించారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు.